బాలీవుడ్ లో ప్రముఖ గాయకుడు షాన్ ఓ స్టేజ్ ప్రదర్శన కోసం అసోంలో గౌహతి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ షాన్ పాట పాడుతున్న సమయంలో ప్రేక్షకులు అతడిపై రాళ్లు, పేపర్ బాల్స్ విసిరారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం నాడు షాన్ ప్రదర్శన కోసం అభిమానులు ఆశగా ఎదురుచూశారు. 

ఆయన బెంగాలీ పాట పాడడంతో నిరాశకి గురైన అభిమానులు అతడిపై రాళ్లతో దాడి చేశారు. అసోంలోని మొత్తం 3.29 కోట్ల మంది జనాభా ఉండగా అందులో రెండు కోట్ల 89 లక్షల మంది పౌరులని మాత్రమే భారతీయులుగా గుర్తించింది ప్రభుత్వం. మిగిలిన దాదాపు 40 లక్షల మందికి గుర్తింపు ఇవ్వకపోవడంతో వారిని విదేశీయులుగా పరిగణిస్తున్నారు.

ఇందులో ఎక్కువ శాతం మంది ముస్లింలు, అందులోనూ బెంగాలీ మాట్లాడే ముస్లింలే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో షాన్ బెంగాలీ పాట పాడడంతో వారికే మద్దతు ప్రకటిస్తున్నాడని భావించిన ప్రేక్షకులు అతడిపై దాడి చేశారు. 

ఊహించని పరిణామానికి షాక్ తిన్న షాన్ మధ్యలోనే పాట ఆపేసి.. 'ఈ పని ఎవరు చేశారో పట్టుకురండి.. ఒక ఆర్టిస్ట్ కి ఇచ్చే గౌరవమిదేనా..? ముందు మర్యాద నేర్చుకోండి.. నాకు జ్వరంగా ఉన్నా మీకు వినోదం పంచడానికి ఇక్కడకి వచ్చాను' అంటూ ఆవేదన వ్యక్తం చేయగా.. తప్పు తెలుసుకున్న అభిమానులు మన్నించాలని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

దానికి షాన్.. 'రాజకీయనాయకుల వలన మీలో అసహనం పెరిగింది. ఏదో ఆవేశంలో అలా చేసుంటారు' అంటూ వారికి బదులిచ్చాడు.