టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. అవకాశాల పేరిట తమను వాడుకోవాలని చూస్తున్నారని ఇప్పటికే చాలా మంది తారలు కామెంట్స్ చేశారు. తాజాగా సింగర్ ప్రణవి కూడా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. 

తాజాగా ప్రణవి తన భర్త కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ తో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇంటర్వ్యూలో భాగంగా తనను ఓ దర్శకుడు ఇబ్బంది పెట్టిన విషయాన్ని చెప్పుకొచ్చింది. టాలీవుడ్ దర్శకుడు ఒకరు తన సినిమాలో పాట పాడాలంటే రాత్రి మొత్తం తనతో గడపాలని నీచంగా మాట్లాడిన విషయాన్ని వెల్లడించింది.

అప్పటికి తను ఇంటర్ చదువుతున్నట్లు తెలిపింది. ఆ దర్శకుడు అలా అడిగిన వెంటనే 'నీ వయసేంటి..? నా వయసేంటి..? చెప్పు తీసుకొని కొడతా' అని సీరియస్ అయినట్లు చెప్పింది. అప్పటినుండి తను ఆఫర్స్ కోసం వెళ్లినప్పుడు పరిస్థితిని అర్ధం చేసుకొని అక్కడ నుండి వచ్చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.

ఒక అమ్మాయిగా తనకూ గౌరవం ఉంటుందని, ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోనని.. రఘుతో పెళ్లైన తరువాత తన జోలికి ఎవరూ రాలేదంటూ తెలిపింది. తెలుగులో 'యమదొంగ', 'శ్రీరామదాసు', 'జెంటిల్మెన్', 'ఒక మనసు', 'పెళ్లిచూపులు' ఇలా చాలా చిత్రాల్లో ప్రణవి పాటలు పాడి ఆడియన్స్ ని అలరించింది.