పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas), కృతి సనన్(kriti sanon) జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(om raut) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్(adipurush).
రాముడి గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) 10 వేలకిపైగా టికెట్లను తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు అందివ్వనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) సైతం తనవంతుగా 10 వేల టికెట్లను, పేద చిన్నారులకు ఉచితంగా ఇవ్వనున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామంలోని రామాలయానికి 100+1 టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు శ్రేయస్ మీడియా (Shreyas Media) ప్రకటించింది.
తాజాగా బాలీవుడ్ సింగర్ అనన్య బిర్లా 10వేల టికెట్స్‌ను బుక్ చేస్తున్నట్లు ప్రకటించింది. అనాథపిల్లల కోసం వీటిని కొన్నట్లు తెలిపింది. ఆ టికెట్స్ ని పలు పిల్లల సేవా సంస్థలకు, అనాథాశ్రమాలకు అందచేయనున్నట్టు ప్రకటించింది. ఇన్ని టికెట్లను ఉచితంగా ఇస్తుండడం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇదే ప్రథమం. అనన్య బిర్లా.. ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత, దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన కుమార మంగళం బిర్లా కుమార్తె. సాంప్రదాయ వ్యాపారాలను విడిచిపెట్టి తనకంటూ సొంత మార్గాన్ని ఎంచుకుంది. ఒక్క బిజినెస్‌లోనే కాకుండా వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
అనన్య బిర్లా స్వతంత్ర మైక్రోఫైనాన్స్ అనే సంస్థను స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అల్పాదాయ వర్గాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సేవలను అందిస్తోంది. ఈ సంస్థకు ఆమె సీఈవోగా కూడా ఉన్నారు. అలాగే క్యూరోకార్టే అనే లగ్జరీ ఈ-కామర్స్ సంస్థను కూడా ఆమె ప్రారంభించారు. హస్త కళాకృతులు, శిల్పకళా ఉత్పత్తులను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది.
అనన్య బిర్లా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. విజయవంతమైన సంగీత విద్వాంసురాలు కూడా. ‘లివిన్ ద లైఫ్’, ‘హోల్డ్ ఆన్’ వంటి అద్బుతమైన సింగిల్స్‌ను ఆమె విడుదల చేశారు. తన మ్యూజిక్‌కి అనేక అవార్డులను గెలుచుకున్నారు. ఆదిపురుష్ లాంటి సినిమాను ప్రజలకు చూపించడంలో తాను సహాయపడడం తనకు చాల సంతోషంగా ఉందని ఆమె తెలిపింది.
