మొన్న కోల్‌కతాకు చెందిన ఓ కాలేజ్‌ ఇంటర్‌ ఫలితాల్లో సన్నీలియోన్‌ పేరు టాప్‌లో వచ్చి అందరిని ఆశ్చర్య పరిచింది. ఆన్‌లైన్‌లో దొర్లిన తప్పుని తెలుసుకున్న కాలేజ్‌ యాజమాన్యం నాలుక కర్చుకుంది. దీనిపై ఇంటర్‌ బోర్డ్ సైతం చర్యలకు సిద్ధమైంది. విద్యా వ్యవస్థలోని లోపాలకు సాక్ష్యంగా నిలిచిందీ ఘటన. ఇది చూసి సన్నీలియోన్‌ సైతం అవాక్కయ్యారు.

ఈ సంఘటన జరిగి వారం రోజులు కూడా కాలేదు. మళ్ళీ అలాంటి మిస్టేక్‌ పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. బెంగాల్‌లోని మల్డా జిల్లాలోని మణిక్‌చక్‌ కాలేజ్‌లో ఆర్ట్స్ విభాగంలో గాయని నేహా కక్కర్‌ పేరు మెరిట్‌ లిస్ట్ లో ప్రత్యక్షమైంది. ఏకంగా మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇది చూసి నేహా సైతం ఆశ్చర్యానికి గురైంది. 

ఈ మెరిట్‌ లిస్ట్ ని శుక్రవారం విడుదల చేయగా, ఈ మిస్టేక్‌ని గుర్తించారు. ఆ వెంటనే తేరుకున్న యాజమాన్యంలో ఆన్‌లైన్‌లో జరిగిన తప్పుని సవరించుకుంది. అయితే ఈ సారి కాలేజ్‌ యాజమాన్యం చాలా సీరియస్‌గా ఉందట. ఎందుకంటే తమ కాలేజ్‌ పరువు దేశ వ్యాప్తంగా పోయింది. అందుకే చాలా సీరియస్‌గా మిస్టేక్‌కి గల కారణాలను విశ్లేషించి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 

`మేం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో, అలాగే బెంగాల్‌ సైబర్‌ క్రైమ్‌ సెల్‌కి ఫిర్యాదు చేశాం. ఇది ఉన్నత విద్యావ్యవస్థను,  పారదర్శకతను ప్రశ్నించేదిగా ఉందని, కొంత మంది కావాలనే అపకీర్తి తేవాలని ఇలాంటి తప్పుడు పనికి పాల్పడ్డార`ని కాలేజ్‌ ప్రిన్సిపల్‌ అనిరుద్ధ చక్రవర్తి తెలిపారు. గత వారం ఆషుతోష్‌ కాలేజీలో ఇంటర్‌లో సన్నీలియోన్‌ పేరు ఫస్ట్ ర్యాంక్‌గా నమోదైన విషయం తెలిసిందే.