గత కొద్ది రోజులుగా తెలుగు మీడియాలో మారు మ్రోగుతున్న పేరు ఒడిసిలేరు బేబీ. మట్టిలోని మాణిక్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న  ఆమె పాటకు తెలుగు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు.  సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్న ‘ఓ చెలియా నా ప్రియ సఖియా..’ పాట పాడిన బేబి దశ తిరిగిపోయింది. టాప్ సింగర్లను తలపించేలా పాడుతున్న  ఆమె తను పాడిన పాటతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఎక్కడ చూసినా ఆమె గొంతే వినిపిస్తోంది.  సమ్మోహనంగా పాడిన పాటకు లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం సైతం ఫిదా అయ్యారు. 

రీసెంట్ గా  ఆమె పాటను విన్న మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ కూడా బేబీకి అభిమానిగా మారిపోయారు. ఆమెను చూడాలని, ఆమె పాటను వినాలన్న కోరికను చిరంజీవి వద్ద వ్యక్తపరిచారు. దీంతో బేబి గురించి వాకబు చేసిన చిరంజీవి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సహకారంతో ఆదివారం ఆమెను ఇంటికి పిలిపించుకున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి స్దాయి వ్యక్తి తన ఇంటికి పిలిపించుకోవడంతో బేబీ ఆనందాన్ని పట్టలేక ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఈ సందర్బంగా కొన్ని పాటలు పాడిన ఆమె చిరూ ఫ్యామిలీని ఆనందపరిచింది.  

అంతేకాదు  టీడీపీ నేత, ఎంపీ మురళీ మోహన్ సన్మానించి, సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు ఆ తర్వాత ఏ ఆర్ రహమాన్ కూడా ఆమె పాటను విని అభినందించిన విషయం తెలిసిందే. 

బేబీ ఎవరంటే..

పసల బేబీ సొంతూరు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలోని ఓ కుగ్రామం వడిశలేరు . ఈమె దినసరి కూలీగా పనిచేస్తూ పొట్టపోసుకుంటోంది. ఎవరో అమ్మాయి తప్పుగా పాడితే తట్టుకోలేక బేబీ తన గళాన్ని విప్పింది. ‘‘ఓ చెలియా నా ప్రియసఖియా’’ అంటూ పాడిన బేబీ గొంతుకు ఎక్కడలేని క్రేజీ వచ్చింది. ఈ వీడియోకి ఫేస్‌బుక్‌లో   వేల లైకులు,   షేర్లు దక్కగా కామెంట్ల పరంపర కొనసాగుతూనే ఉంది.  దాంతో కూనిరాగాలు మాత్రమే తీసే బేబీ ఇప్పుడు లక్షలాది మంది అభిమానులను ఆకట్టుకొంది.