యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహోపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. గురువారం విడుదలైన టీజర్ సినిమాపై మరింతగా ఉత్కంఠని పెంచేసింది. టీజర్ లో ప్రభాస్ చేస్తున్న యాక్షన్ సీన్స్ కళ్ళు చెదిరే విధంగా ఉండడంతో ఆగష్టు 15 కోసం అంతా ఎదురుచూస్తున్నారు. సాహో చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ నటిస్తోంది. 

సాహో టీజర్ కేవలం 24 గంటల్లోనే 60 మిలియన్ల డిజిటల్ వ్యూస్ తో దూసుకుపోతోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళీ భాషల్లో సాహో టీజర్ ని విడుదల చేశారు. ఓ థియేటర్ లో సాహో టీజర్ ప్రదర్శించగా ప్రభాస్ అభిమానులు కేరింతలు కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోని హీరోయిన్ శ్రద్దా కపూర్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

ప్రభాస్ ఫ్యాన్స్ మ్యాడ్ నెస్ అని కామెంట్ పెట్టింది. సుజీత్ దర్శకత్వంలో, ప్రభాస్ సరసన నటించడం, సాహో చిత్ర యూనిట్ తో కలసి పనిచేయడం తన డ్రీమ్ అని పేర్కొంది. సాహో చిత్రం కోసం మేమంతా 2 ఏళ్లుగా కష్టపడుతున్నాం. మా కష్టానికి ఈ విధమైన రెస్పాన్స్ వస్తుండడం సంతోషంగా ఉందని శ్రద్దా కపూర్ పేర్కొంది.