పవన్ కళ్యాణ్‌పై ట్రోల్స్.. హరీష్ శంకర్ భలే కవర్ చేశాడుగా!
పవన్ కళ్యాణ్ తాను నటిస్తున్న `ఉస్తాద్ భగత్ సింగ్` సినిమా పేరుని మర్చిపోయారు. ఆయన తప్పు పలకడంతో నెట్టింట రచ్చ రచ్చ అవుతుంది. దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు.

పవన్ కళ్యాణ్ మంగళవారం మహాన్యూస్ ఛానెల్ కి సంబంధించిన `మహామ్యాక్స్` అనే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌ని లాంచ్ చేశారు. హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ జరిగింది. అతిథిగా వచ్చిన పవన్.. ఛానెల్ లాంచ్ అనంతరం మాట్లాడారు. టీఆర్‌పీ రేటింగ్ ల కోసం కాంట్రవర్సీలు చేయోద్దని, సినిమా వాళ్లని వాడుకోవద్దని, అలాగే సంబంధం లేని రాజకీయాల్లోకి సినిమా వారిని లాగొద్దని తెలిపారు. సినిమా వాళ్లు సెన్సిటివ్ అని వెల్లడించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ నిర్మాతలు సపోర్ట్ చేయాలని అక్కడ ఉన్న నిర్మాతలను, వారు నిర్మించే సినిమాల పేర్లు ప్రస్తావించారు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన సినిమా పేరుని మర్చిపోయారు. `ఉస్తాద్ భగత్ సింగ్` పేరుని ఆయన `సర్దార్ భగత్ సింగ్` అని పలికారు. ఆ తర్వాత తడుముకుని సినిమా పేరేంటి అని అడగ్గా, జనాల నుంచి వచ్చిన మాటతో `ఉస్తాద్ భగత్ సింగ్` నిర్మాతలు నవీన్.. ఈ ఛానెల్‌కి సహకారాలు అందించాలని పవన్ తెలిపారు. అయితే పవన్ తన సినిమా పేరునే తప్పు పలకడం, టైటిల్ మర్చిపోవడం పెద్ద రచ్చ అవుతుంది. పవన్ పై నిన్నటి నుంచి ట్రోల్స్ నడుస్తున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఇది హల్‌చల్ చేస్తుంది.
ఈ నేపథ్యంలో `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా ఆయన రియాక్ట్ అయ్యారు. తనదైన స్టయిల్‌లో దీన్ని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. `ఒరిజినల్ టైటిల్ చెప్పినా ఇంత వైరల్ అయ్యేది కాదు. పోనీలెండి అన్ని మన మంచికే, హ్యాపీ దసరా`అని ట్వీట్ చేస్తూ `ఉస్తాద్ భగత్ సింగ్` యాష్ ట్యాగ్‌ని షేర్ చేశారు హరీష్ శంకర్.
దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆయనకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. పోనిలే అన్నా, నీది చాలా పెద్ద మనసు అని, టైటిల్ అనేది మ్యాటర్ కాదని అంటున్నారు. మరికొందరు దీన్ని కూడా రాద్దాంతం చేస్తున్నారు. అయితే పవన్ మర్చిపోయే సినిమా కాదు, జనం ఎప్పటికీ గుర్తు పెట్టుకునే సినిమా తీయాలని అంటున్నారు ఫ్యాన్స్.
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందిస్తున్న `ఉస్తాద్ భగత్ సింగ్` మూవీలో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆ మధ్య షూటింగ్ జరుపుకుంది. మళ్లీ వాయిదా పడింది. పవన్ `ఓజీ`, రాజకీయాల్లో బిజీగా ఉండటంతో `ఉస్తాద్.. `కి షూటింగ్‌కి బ్రేకులు పడుతుంది.