సినీ నటి శ్రీరెడ్డి, ఆమె మెనేజర్  మోహన్ పై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దాడి చేయడంతోపాటు.. చంపేస్తామంటూ బెదిరింపులు కూడా చేసినట్లు తెలుస్తోంది. కాగా..  ఈ ఘటనపై శ్రీరెడ్డి పోలీసులను ఆశ్రయించగా.. దాడికి ప్పాలడిన ఇద్దరిని అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో పలువురు సెలబ్రెటీలపై ఆరోపణలు  చేసిన తర్వాత.. శ్రీరెడ్డి  చెన్నైలో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం తెల్లవారుజామున చెన్నైలోని శ్రీరెడ్డి ఇంట్లోకి చొరబడి శ్రీరెడ్డి, ఆమె మేనేజర్‌ మోహన్‌పై దాడి చేశారు. 

దీనిపై ఆమె వెంటనే కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేయగా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మద్యం మత్తులో గొడవ పడుతున్న ఫైనాన్షియర్, సినీ నిర్మాత సుబ్రమణి (40), అతని అక్క కుమారుడు గోపి (23)లను అరెస్ట్‌ చేశారు. దాడిలో స్వల్పంగా గాయపడిన శ్రీరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జయ్యారు.

శ్రీరెడ్డి ఫిర్యాదు మేరకు చెన్నై కోయంబేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సదరు నిర్మాత సుబ్రమణి మూడునెలల క్రితం హైదరాబాద్‌లో శ్రీరెడ్డిని లైంగిక వేధింపులకు గురిచేయగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ పోలీసులు సుబ్రమణిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన సుబ్రమణి తన అక్క కుమారుడు గోపీని వెంటబెట్టుకుని వచ్చి శ్రీరెడ్డిపై దాడికి దిగారు. ఈ సంఘటనపై పోలీసులు శ్రీరెడ్డిని విచారిస్తున్నారు.