నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. గత ఆదివారం అలీ ఎలిమినేషన్ తో ప్రేక్షకులకు ఊహించని షాక్ ఎదురైంది. దీనితో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఈ వారం హిమజ, శ్రీముఖి, మహేష్, పునర్నవి, శిల్పా చక్రవర్తి నామినేట్ అయ్యారు. 

వీరిలో శనివారం రోజు హిమజ సేవ్ అయింది. కాగా ఆదివారం రోజు మిగిలిన నలుగురిలో ముందుగా శ్రీముఖి సేవ్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. మధ్యలో వినోదాన్ని అందించేలా నాగార్జున హౌస్ మేట్స్ తో కొన్ని స్కిట్స్ చేయించారు. కొంత సమయానికి మహేష్ కూడా సేవ్ అయ్యాడు. 

చివరకు నామినేషన్ లో  వైల్డ్ కార్డ్ ఎంట్రీ శిల్ప, పునర్నవి మిగిలారు. నాగ్ వారిద్దరిని కన్ఫెషన్ రూమ్ ఒకరిని, కోర్టు యార్డ్ లోకి మరొకరిని పంపారు. కన్ఫెషన్ రూమ్ డోర్ తెరుచుకోవడంతో శిల్ప బయటకు వచ్చింది. దీనితో శిల్పా ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. పునర్నవి సేవ్ అయింది. 

వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ప్రవేశించిన శిల్పా పోటీ కేవలం మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలింది. శిల్ప హౌస్ లో కేవలం 14 రోజులు మాత్రమే గడిపింది. ఇంటి సభ్యులంతా శిల్పా చక్రవర్తిని ఉత్సాహపరుస్తూ సెండాఫ్ ఇచ్చారు. 

అంతకు ముందు నాగ్ హౌస్ మేట్స్ తో చేయించిన స్కిట్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీముఖి, శిల్పా, వరుణ్, మహేష్ కలసి చేసిన స్కిట్ ఆకట్టుకుంది. ఈ స్కిట్ లో శ్రీముఖి మగ గొంతు కలిగిన అమ్మాయిగా అదరగొట్టింది. 

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో హిమజాని ఆటపట్టిస్తూ హౌస్ మేట్స్ చేస్తున్న 'హిమజ హిమజ ది డేర్ అండ్ డాషింగ్ గర్ల్' అనే జింగిల్ బాగా పాపులర్ అయింది. అదే తరహాలో ప్రతి ఒక్కరికి జింగిల్స్ క్రియేట్ చేయమని నాగార్జున రాహుల్ కి చెప్పాడు. 

రాహుల్ చేసిన జింగిల్స్ లో పునర్నవి, శ్రీముఖి కోసం పాడిన జింగిల్స్ అదరగోట్టాయి. పునర్నవి తన డాన్స్, ఆటిట్యూడ్ తో మెప్పించింది. ఇక శ్రీముఖిని ఉద్దేశిస్తూ ఒసేయ్ రాములమ్మ చిత్రంలో టైటిల్ సాంగ్ ని పేరడీ చేశారు. బిగ్ బాసుకే బాసువమ్మా అనే జింగిల్ ఆకట్టుకుంది. ఎపిసోడ్ మొత్తం నాగార్జున తనదైన పంచులతో ఆకట్టుకున్నారు. పునర్నవిని ఎలాగైనా రీఛార్జ్ చేయవయ్యా రాహుల్ అంటూ నాగార్జున వేసిన సెటైర్ నవ్వులు పూయించింది. మొత్తంగా ఆదివారం ఎపిసోడ్ మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగింది.