సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత బాలీవుడ్‌ లో నెపోటిజంకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ విషయంలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా లెజెండరీ మ్యూజీషియన్‌ ఏ ఆర్ రెహమాన్‌ కూడా బాలీవుడ్‌లో ఓ గ్రూప్‌ తనకు అవకాశాలు రాకుండా చేస్తుందని ఆరోపించటం సంచలనంగా మారింది. దీంతో బాలీవుడ్‌ మరోసారి మాఫియాపై చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, దర్శకుడు శేఖర్‌ కపూర్ రెహమాన్‌ వ్యాఖ్యలపై కౌంటర్‌ ఇచ్చాడు. `నీకు నీ సమస్య ఏంటో తెలుసా రెహమాన్‌? నువ్వు హాలీవుడ్‌కు వెళ్లావ్‌.. ఆస్కార్‌ సాధించావ్‌. ఆస్కార్‌ సాధించటం అంటే బాలీవుడ్‌ అవకాశాలకు మరణ శాసనం రాసుకోవటమే. ఆస్కార్‌ సాధించటంతో నీ స్థాయి బాలీవుడ్‌ హ్యాండిల్‌ చేసే స్థాయిని మించి పోయిందని ప్రూవ్‌ అయ్యింది` అంటూ కామెంట్ చేశాడు శేఖర్‌ కపూర్‌.

అయితే శేఖర్‌ కపూర్‌ కామెంట్‌పై ఏఆర్ రెహమాన్‌ స్పందించాడు. `డబ్బు పోతే మళ్లీ వస్తుంది. ఫేం పోతే మళ్లీ వస్తుంది. కానీ జీవితంలో విలువైన కాలం పోతే మాత్రం తిరిగి రాదు. అందుకే సాగిపోవటమే. మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది` అంటూ కామెంట్ చేశాడు రెహమాన్‌.