శేఖర్‌ కమ్ముల రూపొందించిన `లవ్‌స్టోరి`లోని `సారంగదరియా` పాట విడుదలైన సంచలనాలు క్రియేట్‌ చేస్తుంది. అదే సమయంలో వివాదం క్రియేట్‌ చేసింది. ఈ జానపద పాట కోమలి సేకరించిందనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని రచయిత సుద్దాల అశోక్‌ తేజ సైతం ఒప్పుకున్నారు. కానీ సినిమాలోని ఈ పాటలో ఆమెకి క్రెడిట్‌ ఇవ్వలేదు. మంగ్లీచే పాడించిన ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. అయితే కోమలి మాత్రం అసంతృప్తిని, ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తుంది. ఇటీవల `మోసగాళ్లు` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కూడా మోహన్‌బాబు ముందు ఈ విషయాన్ని వెల్లడించింది. ఏకంగా `నేను మోసపోయాను సర్‌` అన్నది. 

దీంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో దిగొచ్చిన దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఆమెతో మాట్లాడారు. ఆమెని కూల్‌ చేశాడు. తన వచ్చే సినిమాలో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో కోమలి కూల్‌ అయ్యింది. తనకు `సారంగ దరియా` పాట విషయంలో ఏమాత్రం అభ్యంతరం లేదని తెలిపింది. ఆమె మాట్లాడుతూ, ``సారంగ దరియా` పాట లవ్ స్టోరి సినిమాలో నాతో పాడించలేదనే బాధ ఇన్ని రోజులు ఉండేది. `రేలారె రేలా ` ద్వారా `సారంగ దరియా` పాటను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ సురేష్ గారి చొవరతో ఇవాళ దర్శకుడు శేఖర్ కమ్ముల గారిని కలిశాను. ఆయన తన రాబోయో సినిమాల్లో అవకాశం ఉంటే నాతో తప్పకుండా పాట పాడిస్తానని మాటిచ్చారు. అలాగే 'లవ్ స్టోరి' సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో స్టేజీ మీద 'సారంగ దరియా' పాట నాతోనే పాడిస్తానన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక సారంగ దరియా పాట విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేద`ని వెల్లడించింది. 

దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, `ఇన్ని రోజులు కమ్యునికేషన్ సమస్య వల్ల గాయని కోమలి గారిని కలవలేకపోయాను. ఇవాళ ముఖాముఖి మాట్లాడుకున్నాం. నేను ఆమెకు మాటిచ్చినట్లు భవిష్యత్ లో నా సినిమాలో జానపద పాట పాడించే అవకాశం ఉంటే తప్పకుండా కోమలికి పాట పాడే అవకాశం ఇస్తాను. నేను సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రామిస్ లను నిలబెట్టుకుంటానని చెప్పాను. కోమలి గారు హ్యాపీగా ఫీలయ్యారు. ఇంతటితో ఈ వివాదం ముగిసిందని భావిస్తున్నా` అని చెప్పారు. మరి ఇంతటితో ఈ వివాదం ముగుస్తుందా? లేదో చూడాలి.