ఫిదా సినిమాతో వరుణ్ తేజ్ కెరీర్ కు అలాగే తన కెరీర్ కి కూడా మంచి బూస్ట్ ఇచ్చుకున్నాడు శేఖర్ కమ్ముల. సింపుల్ లవ్ స్టోరీతో రికార్డులు బద్దలుకొట్టి గత ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న దర్శకులాల్లో ఒకడిగా నిలిచాడు. ఇకపోతే ఆయన నుంచి నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

ఇక మొత్తానికి ఒక లవ్ స్టోరీని సెట్ చేసుకున్న ఈ దర్శకుడు మెయిన్ లీడ్ ను కూడా సెట్ చేసేశాడు. ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ అతని సరసన హీరోయిన్ గా నటించేందుకు ఒక కన్నడ బ్యూటీని ఫిక్స్ చేశాడు. హీరోను ఇంకా చూపించలేదు గాని హీరోయిన్ ఇది వరకే కోలీవుడ్ లో నటించడంతో ఆమె ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

ఆమె ఎవరో కాదు. విజయ్ ఆంటోని నటించిన కాళీ సినిమా హీరోయిన్ అమృత అయ్యర్. ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ కన్నడ సినిమాలో కూడా నటిస్తోంది. అయితే రీసెంట్ గా శేఖర్ కమ్ముల హీరోయిన్స్ కోసం నిర్వహించిన ఆడిషన్ కి వచ్చిన అమృత సింగిల్ టెస్ట్ లో కమ్ములను ఎట్రాక్ట్ చేసి లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఏషియన్ సినిమాస్ సునీల్ నిర్మిస్తోన్న ఈ సినిమాను త్వరలోనే స్టార్ట్ చేయాలనీ దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు.