బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సృష్టించిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న దగ్గర నుంచి బాలీవుడ్ మాఫియా, ఇండస్ట్రీ పెద్దలపై కంగనా రనౌత్ తీవ్ర స్థాయి విమర్శలు చేస్తూ విరుచుకుపడింది. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దలు కూడా కంగనపై త్రీవ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కంగనాకు అవకాశాలు ఇచ్చిన వారు నెపోటిజం కారణంగానే అవకాశాలు ఇచ్చారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ వివాదంలో సీనియర్‌ నటుడు శత్రుఘ్న సిన్హా కంగనాకు మద్దుతుగా నిలిచారు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఎదిగిన  కంగనా మీద ఈర్ష్యా, అసూయలతోనే కొంత మంది ఆమె మీద విమర్శలు చేస్తున్నారంటూ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశాడు.  మన దయాదాక్షిణ్యాలు లేకుండా, మన గ్రూపుల్లో చేరకుండానే తను ఎదిగింది. ఎవరి సాయం లేకుండా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. అందుకే ఆమె విజయాలను చూసి కొంత మంది ఓర్వలేకపోతున్నారు` అంటే కంగనాను పొగడటంతో పాటు ఇండస్ట్రీ పెద్దల మీద విమర్శలు చేశాడు సిన్హా.

తాను హీరోగా ప్రూవ్‌ చేసుకున్న సమయం గురించి మాట్లాడుతూ అప్పట్లో స్టార్‌ కిడ్స్‌ను ప్రమోట్‌ చేసేందుకు ప్రత్యేకంగా కాఫీ విత్‌ కరణ్ లాంటి షోస్ లేవని, అదే సమయంలో ఓ వ్యక్తిని టార్గెట్ చేసి వేదించి ఇండస్ట్రీ నుంచి గెంటేసే రాజకీయాలు కూడా లేవని చెప్పాడు శత్రుఘ్న సిన్హా. అయితే ఇటీవల సుశాంత్‌ మరణం తరువాత బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌ను ట్రోల్‌ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. ఆ సమయంలో శత్రుఘ్న సిన్హా కూతురు బాలీవుడ్ హీరో సోనాక్షి సిన్హా మీద కూడా భారీగానే ట్రోలింగ్ జరిగింది.