'సామజవరగమన' డైరక్టర్ నెక్ట్స్ శర్వా తో కన్ఫర్మ్, ఆ కథేనా?
సామజవరగమన దర్శకుడుతో శర్వానంద్ ప్రాజెక్టు సెట్ అయ్యిందని వినికిడి. వాస్తవానికి రామ్ అబ్బరాజు తన తదుపరి సినిమాని నాగ చైతన్యతో చేయనున్నాడని ఆ మధ్య వార్తలు వినిపించాయి.

ఫ్లాఫ్ ల్లో ఉన్న శ్రీవిష్ణు 'సామజవరగమన'(Samajavaragamana) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ.50 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్టైంది. సరైన హిట్ లేక సతమవుతున్న శ్రీవిష్ణు కెరీర్ కు ఇది మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా చూసి చాలా ఏళ్ల తర్వాత మూవీ లవర్స్ కడుపుబ్బా నవ్వుకోవటం కలిసొచ్చింది. జూన్ 23న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మెుదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోలు కూడా ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. దాంతో ఈ దర్శకుడుకు ఇండస్ట్రీలో మంచి డిమాండ్ వచ్చింది. ఈక్రమంలో ఈ దర్శకుడు నెక్ట్స్ ఏ ప్రాజెక్టు చేయబోతున్నారనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...సామజవరగమన దర్శకుడుతో శర్వానంద్ ప్రాజెక్టు సెట్ అయ్యిందని వినికిడి. వాస్తవానికి రామ్ అబ్బరాజు తన తదుపరి సినిమాని నాగ చైతన్యతో చేయనున్నాడని ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఈ కథ విడాకుల నేపథ్యంలో ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదని, ఇప్పుడు ఈ కథ శర్వానంద్ దగ్గరికి వెళ్ళిందని చెప్తున్నారు. సక్సెస్ లో ఉన్న రామ్ అబ్బరాజు చెప్పిన కథ నచ్చడంతో శర్వానంద్ వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీ అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని అంటున్నారు. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ మూవీలో భాగస్వామ్యం కానున్నారు. మేకర్స్ రానున్న రోజుల్లో శర్వానంద్ కొత్త ప్రాజెక్ట్ వివరాలపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
గతేడాది ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం సినిమాలతో ప్రేక్షకులను పలుకరించాడు శర్వానంద్. టైమ్ లైన్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఒకే ఒక జీవితం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.ఇక ప్రస్తుతం శర్వానంద్ (Sharwanand) శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ లండన్‌లో కొనసాగింది. అయితే కొన్ని చేర్పులు,మార్పులతో మంచి అవుట్ ఫుట్ కోసం రీషూట్ లు చేస్తున్నారని ఇన్‌సైడ్ టాక్. ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే శర్వానంద్ కొత్త సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.