హీరో శర్వానంద్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. చిన్న చిన్న పాత్రలతో మొదలైన శర్వానంద్ కెరీర్ ప్రస్తుతం హీరోగా తనకంటూ మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. శర్వానంద్ కు మంచి నటుడనే పేరు ఉంది. తాజాగా సమాచారం ప్రకారం శర్వానంద్ ప్రమాదానికి గురయ్యాడు. శర్వానంద్ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ చిత్రం 96 రీమేక్ లో నటిస్తున్నాడు. 

ఈ చిత్ర షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది. ఈ చిత్రం కోసం శర్వానంద్ స్కైడైవింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో శర్వానంద్ భుజానికి, కాలికి తీవ్రగాయాలయ్యాయి. దీనితో శర్వానంద్ ని వెంటనే హైదరాబాద్ కు తీసుకుని వచ్చి సన్ షైన్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. 

96 సినిమా షూటింగ్ లో భాగంగా శర్వానంద్ స్కైడైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఫైట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో స్కై డైవింగ్ జరుగుతోంది. నాలుగుసార్లు శర్వానంద్ విజయవంతంగా స్కైడైవింగ్ చేశాడు. ఐదవసారి ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లో శర్వానంద్ భుజానికి వైద్యులు శస్త్రచికిత్స చేయనున్నట్లు తెలుస్తోంది. దీనితో శర్వానంద్ కొన్ని వారాలపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. 

శర్వానంద్ ప్రస్తుతం రణరంగం అనే ఓ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. త్వరలో 96 చిత్ర షూటింగ్ పూర్తిస్తాలో ప్రారంభం కావాల్సి ఉండగా ఈ యంగ్ హీరోకు ప్రమాదం జరిగింది. తమిళంలో 96 చిత్రంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. కొన్ని రోజుల క్రితమే మెగా హీరో వరుణ్ తేజ్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో వరుణ్ సురక్షితంగా బయటపడ్డాడు. ఇంతలోనే శర్వానంద్ ప్రమాదానికి గురయ్యాడు.