`శంకర్ దాదా ఎంబీబీఎస్` రీ రిలీజ్.. మెగాస్టార్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
రీ రిలీజ్ ల ట్రెండ్ ఊపందుకున్న నేపథ్యంలో ఇప్పుడు మరో మూవీ రిలీజ్ రిలీజ్‌కి సిద్ధమవుతుంది. మెగాస్టార్ నటించిన `శంకర్ దాదా ఎంబీబీఎస్` చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో స్ట్రెయిట్ సినిమాల కంటే రీ రిలీజ్‌లు ఎక్కువగా ఉంటున్నాయి. ఓ రకంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ పీక్‌లో నడుస్తుంది. చాలా సినిమాలు మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. కొన్ని చిత్రాలు ఒరిజినల్‌గా రిలీజ్ టైమ్‌లో వచ్చిన వసూళ్ల కంటే ఇప్పుడే ఎక్కువ కలెక్షన్లని రాబట్టడం విశేషం. `ఈ నగరానికి ఏమైంది` చిత్రం అలాంటి ఫలితాన్ని సాధించింది. అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇప్పుడు మరో మూవీ రిలీజ్ రిలీజ్‌కి సిద్ధమవుతుంది. మెగాస్టార్ (Chiranjeevi) నటించిన `శంకర్ దాదా ఎంబీబీఎస్`(Shankar Dada MBBS) చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. జయంత్ సి పరంజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2004లో అక్టోబర్ 15న విడుదలైంది. పెద్ద హిట్ అయ్యింది. ఏకంగా వంద రోజులు ఆడింది. ఇందులో మెగాస్టార్‌తోపాటు శ్రీకాంత్ ముఖ్య పాత్ర పోషించారు. సోనాలీ బింద్రే కథానాయికగా నటించింది. పరేష్ రావల్ కీలక పాత్ర పోషించారు. సినిమా చివర్లో పాటలో పవన్ కళ్యాణ్ కూడా మెరవడం విశేషం. ఈ చిత్రం హిందీలో వచ్చిన సంజయ్ దత్ `మున్నాబాయ్ ఎంబీబీఎస్`కి రీమేక్. రాజ్ కుమార్ హిరానీ రూపొందించారు. అప్పట్లో బాగా సందడి చేసిందీ మూవీ.
దాదాపు 19ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావడం విశేషం. కరెక్ట్ గా రిలీజ్ డే రోజున ఈ రీ రిలీజ్‌ని ప్రకటించారు. జెమినీ ఫిల్మ్ సర్య్కూట్ సంస్థ రీ రిలీజ్ చేస్తుంది. వచ్చే నెల నవంబర్ 4న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. మరి అప్పుడు వర్కౌట్ అయిన మ్యాజిక్ ఇప్పుడు వర్క్ అవుతుందా?, రీ రిలీజ్ ల ట్రెండ్ ఊపందుకునేలాచేస్తుందా అనేది చూడాలి. అయితే చిరంజీవి చిత్రాలు రెండు మూడు రీ రిలీజ్ అయ్యాయి. కానీ పెద్దగా ఆదరణ పొందలేదు. ఈనేపథ్యంలో మళ్లీ మెగాస్టార్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? అనేది చూడాలి.
ఇక ప్రస్తుతం చిరంజీవి.. వశిష్ట దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. యూవీ క్రియేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుందట. అయితే ఈ సినిమాకి `ముల్లోకాల వీరుడు` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. కానీ `జగదేక వీరుడు అతిలోక సుందరి` చిత్ర నిర్మాణ సంస్థ తమ కంటెంట్, టైటిల్, రీమేక్, సీక్వెల్, ప్రీక్వెల్ ఇలా అన్ని హక్కులు తమ వద్దే ఉన్నాయని, ఎవరూ వాటిని వాడుకోవడానికి వీల్లేదని స్పష్టం చేయడంతో టైటిల్‌ని మార్చే ఆలోచనలో ఉన్నారట. కథలోనూ మార్పులు జరుగుతున్నట్టు సమాచారం.