బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ పెళ్లి చేసుకోబోతుందంటూ కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శ్రద్ధా చాలా కాలంగా తన స్నేహితుడు రోషన్ శ్రేష్టతో ప్రేమలో ఉందని.. వచ్చే ఏడాది ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతుందని.. శ్రద్ధా తల్లి పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉందని గురువారం నాడు వార్తలు వినిపించాయి.

దీనిపై స్పందించిన శ్రద్ధాకపూర్ తండ్రి శక్తికపూర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. శ్రద్ధా వివాహం చేసుకోబోతుందట కదా నిజమేనా..? అని మీడియా అడిగిన ప్రశ్నకి శక్తికపూర్ స్పందిస్తూ.. 'అవునా.. నిజంగా నా కూతురు పెళ్లి చేసుకోబోతుండా..? ఎక్కడ..? పెళ్లెప్పుడు..? ఈ పెళ్లి గురించి నాకేం చెప్పలేదు.. కానీ తండ్రిగా నేను కూడా అక్కడ ఉండాలి కదా.. ప్లీజ్ నా కూతురి పెళ్లికి నన్ను పిలవండి.. మర్చిపోకండి' అంటూ సెటైర్లు వేశాడు.

ఆ తరువాత శ్రద్ధాకి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. మరో నాలుగేళ్ల వరకు ఆమె పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదని చెప్పారు. ప్రస్తుతం ఈ బ్యూటీ 'సాహో', 'స్ట్రీట్ డాన్సర్ 3D','బాఘి 3' వంటి చిత్రాల్లో నటిస్తోంది.