శృంగార తారగా సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న నటి షకీలా తాజాగా నటి సిల్క్ స్మితపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సిల్క్ స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్ లో 'డర్టీ పిక్చర్' అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే.

విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పెద్ద సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమాలో సిల్క్ స్మిత నటి షకీలాని తక్కువగా చూసేవారనే అర్ధం కొన్ని డైలాగులు ఉన్నాయి. అయితే వాటిలో నిజం లేదని అంటున్నారు షకీలా.

సిల్క్ స్మితతో తనకు ఎలాంటి వైరం లేదని క్లారిటీ ఇచ్చింది షకీలా. ఆమె మాట్లాడుతూ.. ''విద్యాబాలన్ 'డర్టీ పిక్చర్'లో నా గురించి చూపించినదానిలో నిజం లేదు. నా తొలి సినిమా 'ప్లే గర్ల్స్'లో నేను స్మిత చెల్లెలిగా నటించాను. అప్పటి నుండి కూడా మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు. సినిమాలో వాళ్లకు కావలసినట్లుగా రాసుకున్నారు. అందుకే అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు'' అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం షకీలా జీవితం ఆధారంగా ఓ బయోపిక్ ని రూపొందిస్తున్నారు. రిచా చద్దా నటిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.