కొన్ని నెలల క్రితం సినీ నటి భానుప్రియపై తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. భానుప్రియ తన ఇంట్లో పనిచేస్తున్న మైనర్ బాలికని వేధిస్తున్నట్లు వచ్చిన వార్తలు సంచనలం సృష్టించాయి. సామర్లకోటకు చెందిన ఓ మహిళ చెన్నైలోని భానుప్రియ నివాసంలో తన కుమార్తెని పనికి చేర్పించింది. తన కుమార్తెని ఇంటికి పంపడం లేదని, వేధిస్తోందని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. 

పోలీసులు విచారణ కూడా చేశారు. ఈ సంఘటన విషయంలో భానుప్రియ వాదన మరోలా ఉంది. తన ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయి మైనర్ అనే విషయం తనకు తెలియదని భానుప్రియ మీడియాకు తెలిపింది. పైగా ఆ అమ్మాయి తన ఇంట్లో కొన్ని దొంగతనాలు కూడా చేసినట్లు భానుప్రియ ఆరోపించింది. ఇదిలా ఉండగా బుధవారం రోజు బాలకార్మికుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా సమాఖ్య నిర్వాహకుడు శేషారత్నం మాట్లాడుతూ భానుప్రియపై విమర్శలు చేశారు. భానుప్రియ తన నివాసంలో నలుగురు మైనర్ బాలికలని పనికి పెట్టుకుని వేధిస్తోందని ఆమెపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలకార్మికుల చట్టాన్ని బట్టి మైనర్ పిల్లలని పనికి పెట్టుకుంటే 50 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కేసు తీవ్రతని బట్టి శిక్ష కూడా అమలవుతుంది. శేషారత్నం వ్యాఖ్యలని పోలీసులు సీరియస్ గా తీసుకుంటారో లేదో చూడాలి.