సర్వీస్ టాక్స్ చెల్లించని కేసుకు సంబంధించి నటుడు విశాల్ మంగళవారం ఎగ్మూర్ ఆదాయ నేరాల విచారణ న్యాయస్థానంకి హాజరయ్యారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు కేసు విచారణను ఆగస్ట్ 1వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

నటుడు విశాల్ కోటి రూపాయల వరకు సర్వీస్ టక్స్ చెల్లించలేదని ఆదాయపన్ను శాఖ 2016 నుండి 2018 వరకు ఐదుసార్లు సమన్లు జారీ చేసింది. అయినా విశాల్ ఒక్కసారి కూడా నేరుగా హాజరు కాలేదు. ఆయన తరఫున ఆడిటర్ మాత్రమే హాజరయ్యారు. ఇందువల్ల ఆదాయపుపన్ను  శాఖ విచారణకు నేరుగా హాజరు కావాలని చెన్నై ఎగ్మూర్ కోర్టులో కేసు దాఖలు చేసింది.

ఈ కేసు విచారణ కోసం విశాల్ గతేడాదిఅక్టోబర్ నెలలో కోర్టుకి హాజరయ్యారు. ఆ సమయంలో న్యాయమూర్తి ఆదాయపన్ను శాఖ సమన్లు జారీ చేసినా ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించగా.. కొన్ని అనివార్య కారణాల వలన హాజరుకాలేకపోయానని న్యాయమూర్తి వద్ద విశాల్ తెలిపారు.

చేసిన తప్పు ఒప్పుకుంటారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. తాను ఏ తప్పు చేయలేదని, కోర్టులో నిరూపించుకుంటానని తెలపడంతో జూలై 2వ తేదీకి వాయిదా వేశారు. ఈ క్రమంలో మంగళవారం నాడు కేసు విచారణకు హాజరై తన వాదనలు వినిపించాడు విశాల్. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఆగస్ట్ 1వ తేదీకి కేసును వాయిదా వేశారు.