తెలుగు పాపులర్‌ సీరియల్‌ `గృహలక్ష్మి` ఫేమ్‌ లహరి కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. మంగళవారం రాత్రి శంషాబాద్‌లో సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 

`గృహలక్ష్మి` తెలుగు సీరియల్‌ నటి లహరి(Serial Actress Lahari) రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు, బైక్‌ని ఢీ కొట్టింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. లహరి ప్రయాణిస్తున్న కారు, బైక్‌ పై వెళ్తున్న వ్యక్తిని వెనకాల నుంచి ఢీ కొట్టినట్టు తెలుస్తుంది. ఔటర్ రింగ్‌ రోడ్డుపై ప్రైవేట్‌ పెట్రోలింగ్‌ వాహనం నడిపే వ్యక్తి డ్యూటీ ముగించుకుని శంషాబాద్‌ వైపు బైక్‌పై వెళ్తుండగా, వెనకాల నుంచి మారుతి సియాజ్‌(TS 07 FA 9534) నెంబర్‌ గల కారు ఢీ కొట్టింది. దీంతో బైక్‌ పై వెళ్తున్న వ్యక్తి కిందపడిపోయాడు. ఆయనకు గాయాలయ్యాయి. 

ఇది గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని కారుని చుట్టుముట్టారు. కారుని డ్రైవ్‌ చేస్తున్న మహిళని కిందకి దిగాలంటూ వారించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న మహిళ నటి లహరిగా గుర్తించారు. ఆమెని చూసి అక్కడి వారంతా షాక్‌కి గురయ్యారు. ఆమె మద్యం మత్తులో యాక్సిడెంట్‌ చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో నటి లహరిని పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. అయితే బ్రీత్‌ అనలైజర్‌ని పరీక్షించగా ఆమె మద్యం తీసుకోలేదని తేలింది. గాయపడిన వ్యక్తి కూడా పోలీసు ఫిర్యాదు చేయకపోవడంతో లహరిని విడిచిపెట్టారు.