కరోనా సెకండ్ వేవ్ ఎంత ప్రమాదకరంగా ఉందో తెలియడానికి తాజా మరణాలు నిదర్శనం. కరోనా దేశవ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తుంది. రోజుకు వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరుసగా కరోనా బారినడుతున్నారు. దురదృష్టవశాత్తు కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. 


తాజాగా కరోనా మహమ్మారి ఓ నిర్మాతను బలిదీసుకుంది. నిర్మాత చిట్టి నాగేశ్వరరావు అలియాస్  సి ఎన్‌ రావు కరోనా సోకి దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సీఎస్ రావ్ మంగళవారం తుదిశ్వాస విడిచారు.  ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో జన్మించిన సీఎన్‌ రావు అనేక చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. అలాగే నిర్మాతగా కొన్ని చిత్రాలు నిర్మించారు. మా సిరిమల్లె, అమ్మా నాన్న లేకుంటె, బ్రహ్మానందం డ్రామా కంపెనీ వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ్‌లో ఊరగా అనే చిత్రాన్ని నిర్మించారు ఆయన.

 

అలాగే పరిశ్రమకు చెందిన పలు ముఖ్య పదవుల్లో ఆయన కొనసాగారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడు, తెలుగు చలన చిత్ర నిర్మాతల సెక్టార్‌ సెక్రటరీగా, సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ అఫ్‌ కామర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారాయన. వాటితో పాటు  ఫిల్మ్‌ ఫెడరేషన్‌ అఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యునిగానూ వ్యవహరించారు.