దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో టాప్‌ ప్లేస్‌కి చేరిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌ను కూడా అదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. భారీ తారగణంతో పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీ స్టార్‌ కాస్ట్‌ను తీసుకున్నారు. ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌, హాలీవుడ్‌ నటి ఒలివియా మోరిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో మరో హాట్ హీరోయిన్‌ నటిస్తున్న విషయం బయటకు వచ్చింది. సీనియర్‌ నటి శ్రియ ఆర్ ఆర్ ఆర్‌లో కీలక పాత్రలో నటించనుంది. ఈ విషయాన్ని శ్రియ స్వయంగా వెల్లడించింది. ప్రముఖ సోషల్ మీడియా యాప్‌ హలోతో మాట్లాడుతూ శ్రియ ఈ విషయాన్ని వెల్లడించింది. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి వివరిస్తూ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్నట్టుగా కన్‌ఫార్మ్‌ చేసింది.

అంతేకాదు తాను ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్‌లో అజయ్‌ దేవగన్‌కు జోడిగా నటిస్తున్న విషయాన్ని కూడా బయట పెట్టింది శ్రియ. దీంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్‌గా మారింది. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ముందుగా జనవరి 8న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ లాక్ డౌన్‌ కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేసే పరిస్థితి కనిపించటం లేదు.

పీరియాడిక్‌ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్టీఆర్‌ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.