సమాజంలో ఉన్నత స్థానం పొందిన ప్రతిభావంతుల్లో తొంభై శాతం మంది సక్సెస్ వెనుక ఎంతో కష్టం, దుఃఖం దాగి వుంటుంది. అలాంటి వాళ్ల గురించి, వాళ్ల సక్సెస్‌ను గురించి పది మంది పొగుడుతున్నప్పుడు.. తాము బతకడం కోసం పోరాడిన సందర్భాలు గుర్తుచేసుకుని వాళ్ల కళ్లు చెమ్మగిల్లుతాయి. ముఖ్యంగా సినిమా రంగంలో రాణించడమంటే ఆషామాషీ కాదు. కష్టాలు మోసుకుంటూ వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగిన ఆ కోవకు చెందినవారిలోనే సీనియర్ నటీమణి ఖుష్బూ కూడా వున్నారు.

 

హైదరాబాద్ లో జరిగిన ఇండియాటుడే కాన్‌క్లేవ్‌లో తన జీవితంలోని చేదు ఘటనలను, ఆ సమయంలో అనుభవించిన దుఃఖాన్ని నటి ఖుష్బూ గుర్తుచేసుకున్నారు. సినిమాల్లోనే కాదు.. బయట కూడా నేను రెబల్. చిన్న వయసులోనే రెబెల్‌ తరహాలో తిరగబడ్డాను. అది కూడా మా నాన్న పైనే. మా నాన్నతో ఉండలేక.. మా అమ్మను, సోదరుడ్ని తీసుకుని బయటకొచ్చేశా. మా నాన్న మహిళలను కించపరుస్తూ మాట్లాడటం నాకు నచ్చలేదు. భార్యను అసభ్యంగా దూషించే భర్త ఆయన.

 

మా అమ్మను తిట్టడం మగాడి ప్రపంచంలో భార్య ఇలాగే ఉండాలన్న గర్వం నాకు నచ్చలేదు. ఇంటి నుంచి బయటకొచ్చేటప్పటికీ నాకు 16ఏళ్లు. గతి లేక మీరే ఏదో రోజు నాదగ్గరికి వస్తారని మా నాన్న అన్నారు.

 

నేను ఆయనకు చెప్పా. ఆరోజు నాకు ఇంకా గుర్తుంది. అది అది 1986 సెప్టెంబరు 12. నువ్వు పాక్కుంటూ వెళ్లి బిక్షాటన చేసి, డబ్బు తీసుకురా అని ఆ రోజు మా నాన్న నాతో అన్నాడు. అమ్మను, సోదరుడిని చంపేసి..నేను రైలు కిందపడి చస్తా కానీ ఆ పని చేయను చెప్పాను.

 

ఏదో రోజు నువ్వు నన్ను చూసి చింతిస్తావని కూడా చెప్పాను. ఇక ఎప్పటికీ నీ దగ్గరికి రానని చెప్పేశాను. ఇండియా అంతా నా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు.. కుష్బూ ఒక మహిళగా పేరు తెచ్చుకుంది అని చెబుతున్నప్పుడు.. కచ్చితంగా నువ్వు చూసి తీరుతావని ఆనాడే శపథం చేశాను. ఆ స్థాయికి చేరుకున్నందుకు సంతోషంగా ఉన్నా.

 

ఆ శపథం చేసి 31ఏళ్లయినా ఇప్పటికీ నాన్న ముఖం చూడలేదు. చూడాలని కూడా అనుకోవట్లేదు. కాగా, సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్న కుష్బూ ఇటీవలే అజ్ఞాతవాసితో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.