సీనియర్ నటి ఇంద్రజ 90వ దశకంలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో నటించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇంద్రజ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించింది. శతమానం భవతి, హ్యాపీ వెడ్డింగ్, లయన్ లాంటి చిత్రాల్లో నటించింది. ఇంద్రజ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో నాకు మహేష్ బాబు నటించిన ఖలేజా చిత్రం చాలా ఇష్టం. ఆ చిత్రం ఎందుకు సరిగా ఆడలేదో నాకు ఇప్పటికి అర్థం కావడం లేదు. ఒక్కడు, అతడు లాంటి చిత్రాల్లో మహేష్ బాబుని చూసి ఈయన ఎప్పుడూ సీరియస్ గానే ఉంటాడా అని అనిపించింది. కానీ ఖలేజా చిత్రంలో మహేష్ కామెడీ టైమింగ్ చూసి ఆశ్చర్యపోయా. మహేష్ కామెడీ కోసం ఆ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తుంటా అని ఇంద్రజ అన్నారు. 

కనీసం ఒక్కసారైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని కలసి ఖలేజా చిత్రం అద్భుతంగా తీశారు అని చెప్పాలని అనుకున్నా. ఓ సారి అవకాశం వచ్చింది. ఖలేజా చిత్రం గురించి మాట్లాడుతున్న సమయంలో ఆయన పవన్ కళ్యాణ్ గారి అజ్ఞాతవాసి చిత్ర ప్రస్తావన తీసుకువచ్చారు. అజ్ఞాతవాసి చిత్రంలో చిన్న రోల్ ఉంది చేస్తారా అని అడిగారు. వెంటనే ఒప్పుకున్నా. 

ఫ్లాష్ బ్యాక్ లో కొన్ని సెకండ్ల పాటు మాత్రమే కనిపించే పాత్ర నాది. చిన్న పాత్ర అయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం చేశా. నా పాత్ర ఇంకాస్త ఎక్కువ సమయం ఉందిఉంటే బావుండేది అని అనిపించింది. భవిష్యత్తులో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలని ఎంచుకుంటా అని ఇంద్రజ తెలిపారు.