సీనియర్ సినిమా జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి కన్నుమూత..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర సినీ పాత్రికేయులు గుడిపూడి శ్రీహరి మరణించారు. అనారోగ్యంతో ఆయన సొంతింట్లో కన్నుమూశారు.
హైదరాబాద్ : అర్థ శతాబ్దం పాటు సినీ విశ్లేషనకుడిగా, పాత్రికేయుడిగా సేవలందించిన సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి మంగళవారం మృతి చెందారు. మంగళవారం ఉదయమే పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తికి మాతృవియోగం కలిగింది. ఈ వార్త ఇండస్ట్రీలో అందరినీ కలిచివేసింది. ఆ తరువాత కొన్ని గంటల్లోనే శ్రీహరి మరణం రూపంలో మరో విషాదకర వార్త వెలుగులోకి వచ్చింది.
గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీలో.. సినీ జర్నలిస్టుల్లో పలువురు ప్రముఖులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. ఒకదాని తరువాత ఒకటి వరుస విషాదాలు ఇండస్ట్రీనివెంటాడుతున్నాయి. తాజాగా మరో సీనియర్ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి మరణం విషాదాన్ని నింపింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తికి మాతృవియోగం...
గుడిపూడి శ్రీహరి పలు ప్రముఖ ప్రతికలలో పనిచేశారు. సుమారు 55 యేళ్ల పాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా, సేవలందించారు. తెలగు సినిమా ఇండస్ట్రీ అనే పుస్తకాన్ని కూడా రచించారు. గుడిపూడి శ్రీహరికి 2013 సంవత్సరానికి గానూ తెలుగు విశ్వవిదా్యలయం ‘పత్రికా రచన’లో ‘కీర్తి పురస్కారం’ ప్రకటించింది. 1969నుంచి ది హిందూ పత్రికలో రివ్యూలు రాయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఎన్నో తెలుగు సినిమాలకు రివ్యూలు రాశారు. సినిమా రిలీజయ్యిందంటే చాలూ.. ఆయన రివ్యూ కోసం ఎదురు చూసేవాళ్లు. ఇప్పటంత సౌకర్యాలు లేని కాలంలో కూడా ప్రతీ తెలుగు సినిమా చూసేవారు. తన దైన శైలిలో రివ్యూ అందించే వారు. అదే ఆయనకు సినిమా పట్ల ఉన్న మమకారానికి నిదర్శనం.
గుడిపూరి శ్రీహరి భార్య లక్ష్మి నిరుడు నవంబర్ లో మరణించారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. విదేశాల్లో ఉన్న కుమారుడు శ్రీరామ్ రాగానే అంత్యక్రియలు చేస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. గుడిపూడి శ్రీహరి మరణవార్త తెలిసి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.