పరిశ్రమలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ తుదిశ్వాస విడిచారు. తెలుగు-తమిళ భాషల్లో పలు చిత్రాలకు ఎడిటర్ గా పని చేసిన కోలా భాస్కర్ వయసు 55కాగా అనారోగ్యంతో మరణించారు. కోలా భాస్కర్ కు భార్య, కుమారుడు ఉన్నారు. చాలా కాలంగా కోలా భాస్కర్ గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. నేడు ఆయన చికిత్స  పొందుతూ ఉదయం 8 గంటలకు కన్ను మూశారు. 

బ్లాక్ బస్టర్స్ ఖుషి, 7జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే వంటి చిత్రాలకు కోలా భాస్కర్ ఎడిటర్ గా పనిచేయడం జరిగింది. పలు తమిళ చిత్రాలకు కూడా ఎడిటర్ గా పనిచేసిన కోలా భాస్కర్ సౌత్ ప్రేక్షకులకు సుపరిచితులే. కోలా భాస్కర్ ఏకైక కుమారుడు కోలా బాలకృష్ణ హీరోగా ఓ చిత్రం చేయడం జరిగింది. ద్విభాషా చిత్రంగా విడుదలైన ఈ మూవీ తెలుగులో నిన్ను వదిలి నేనుపోలేనులే టైటిల్ తో విడుదల అయ్యింది. ప్రముఖ దర్శకులు సెల్వ రాఘవ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కోలా భాస్కర్ స్వయంగా నిర్మించారు. 

కోలా భాస్కర్ అకాల మృతిపై పలువురు చిత్ర ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. అలాగే కోలా భాస్కర్ కుటుంబానికి తమ సానుభూతి తెలియపరుస్తున్నారు. 2020 చిత్ర పరిశ్రమకు అసలు కలిసి రాలేదు. ఈ ఏడాది అనేక మంది నటులు, సాంకేతిక నిపుణులు అకాల మరణం పొందడం జరిగింది.