పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మృణాల్ సేన్ కన్నుమూశారు. బెంగాల్ చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన నేడు కలకత్తాలోని సొంత ఇంటిలోనే తుది శ్వాసను విడిచారు. 96 ఏళ్ల మృణాల్ సేన్ గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మధ్య పరిస్థితి విషమించడంతో గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. 

సీనియర్ దర్శకులైన మృణాల్ 1923లో బ్రిటిష్ ఇండియా కాలంలో రీదాపూర్(ఇప్పటి బంగ్లాదేశ్)లో జన్మించారు. సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్ వంటి దిగ్గజ దర్శకుల సమకాలికుడు. ఇక ఆయన తొలి చిత్రం రాత్ భోరే 1955లో ఒక సెన్సేషన్ కాగా రెండో సినిమా 'నీల్ ఆకాశర్ నీచే' మరింతగా ఆదరణను దక్కించుకుంది. 

2002వరకు మృణాల్ ఎన్నో మంచి చిత్రాలను నార్త్ ప్రేక్షకులకు అందించారు. షార్ట్ ఫిల్మ్స్ తో పాటు డాక్యుమెంటరీస్ కూడా ఆయన తనదైన శైలిలో ప్రజెంట్ చేసేవారు.  2017లో  ఫిల్మ్ ఫేర్ జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్న మృణాల్ జాతీయ అంతర్జాతీయ అని తేడా లేకుండా అనేక అవార్డులను గెలుచుకున్నారు. ఆయన మృతిపట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ - రాష్ట్రపతి రామ్ నాథ్ సంతాపం తెలియజేశారు.