Asianet News TeluguAsianet News Telugu

విషాదంః `ప్రాణం ఖరీదు` దర్శకుడు కె వాసు కన్నుమూత

మెగాస్టార్‌ చిరంజీవిని హీరోగా వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు కె వాసు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 

senior director k vasu passed away arj
Author
First Published May 26, 2023, 6:44 PM IST

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్‌ దర్శకుడు కె వాసు(72) కన్నుమూశారు. ఇటీవల శరత్‌ బాబు, సంగీత దర్శకుడు రాజ్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో విషాదం టాలీవుడ్‌లో చోటు చేసుకోవడం విచారకరం. చిరంజీవితో `ప్రాణం ఖరీదు` వంటి అనేక చిత్రాలను రూపొందించిన దర్శకుడు కె వాసు తాజాగా తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. దీంతో టాలీవుడ్‌లో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. దర్శకుడి మృతి పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.

1974లో `ఆడపిల్లల తండ్రి` చిత్రంతో దర్శకుడిగా మారారు కె వాసు. ఇందులో కృష్ణంరాజు, నాగభూషణం, భారతి ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి దర్శకత్వం వహించడమే కాదు, నిర్మాతగా, రచయితగా వర్క్ చేసి చిన్న వయసులోనే మూడు విభాగాల్లో పనిచేసిన దర్శకుడిగా రికార్డు క్రియేట్‌ చేశారు కె వాసు. ఆ తర్వాత కొంత గ్యాప్‌తో చిరంజీవి, జయసుధ, చంద్రమోహన్‌, మాధవి, నూతన్‌ ప్రసాద్‌, రావు గోపాలరావు లు నటించిన `ప్రాణం ఖరీదు` చిత్రానికి దర్శకత్వం వహించి మెప్పించారు. ఈ సినిమాతో చిరంజీవి నటుడిగా వెండితెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే.

వీటితోపాటు `అమెరికా అల్లుడు`, `శ్రీషిరిడీ సాయిబాబా మహత్యం`, `ఇంట్లో శ్రీమతి వీధిలోకుమారి`, `అల్లుళ్లొస్తున్నారు`, `కోతల రాయుడు`, `ముద్దూ ముచ్చట`, `ఒక చల్లని రాత్రి`, `ఆరని మంటలు`, `సరదా రాముడు`, `గోపాలరావుగారి అమ్మాయి`, `దేవుడు మామయ్య`, `కలహాల కాపురం` వంటి పలు హిట్ చిత్రాలకు కే. వాసు దర్శకుడిగా పనిచేశారు. టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్నారు.

దర్శకుడు కే వాసు.. ప్రముఖ దర్శకుడు కె ప్రత్యగాత్మ  పెద్ద కుమారుడు కావడం విశేషం. ప్రధానంగా హస్య చిత్రాలు చేసిన కె వాసు.. కె ప్రత్యగాత్మ, సత్యవతిలకు హైదరాబాద్‌లో 1951 జనవరి 7న జన్మించారు. తాత కోటయ్య గుంటూరులో రుషికేశ్‌ ఆశ్రమాన్ని స్థాపించాడు. వాసు పదవ తరగతి వరకు  మద్రాస్‌లోని కేసరి హైస్కూల్‌లో చదివాడు. ఆ తర్ఆవత మెట్రిక్యులేషన్‌ కోసం గుంటూరు, హైదారబాద్‌లో చదివారు. అయితే చదువు పెద్దగా అబ్బలేదు. దీంతో బాబాయ్‌ కె హేమాంబరధరరావు సినిమాలోకి తీసుకొచ్చాడు. అప్రెంటీస్‌గా చేర్చుకున్నాడు. ఆ తర్వాత కెమెరామెన్లు ఎంజీ సింగ్‌, ఎం సీ శేఖర్‌ల వద్ద అసిస్టెంట్‌ కెమెరామెన్‌గా రెండేళ్లు పనిచేశారు. 

ఎడిటర్‌ బి గోపాలరావు వద్ద అసిస్టెంట్‌గా ఏడాదిపాటు వర్క్ చేశారు. తన తండ్రి ప్రత్యగాత్మ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా `ఆదర్శకుటుంబం`, `మనసు మాంగల్యం`, `పల్లెటూరి బావ` చిత్రాలకు పనిచేశారు. ఆ తర్వాత తన22 ఏళ్ల వయసులో `ఆడపిల్లల తండ్రి` చిత్రంతో తొలి సారి దర్శకుడిగా వెండితెరకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కొంత గ్యాప్‌లో పదుల సంఖ్యల్లో సినిమాలు చేశారు. 1982లో రత్న కుమారిని వివాహం చేసుకున్నాడు కె వాసు. వీరికి ఇద్దరు కూతుళ్లు అన్నపూర్ణ, దీప్తి ఉన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios