ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణం సినీ పరిశ్రమను, ప్రేక్షకులను విషాదంలో ముంచెత్తింది. ఆమె అనారోగ్యం, చనిపోవడానికి ముందు ఎదురైన పరిణామాల గురించి భర్త కృష్ణ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే చివరి రోజుల్లో విజయనిర్మల అనుభవించిన మానసిక వేదన గురించి కొడుకు నరేష్ ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడారు. కృష్ణ విషయమై విజయనిర్మల ఎంతగా తల్లడిల్లిపోయిందో వెల్లడించారు. చనిపోవడానికి కొద్దిరోజుల ముందు విజయనిర్మల నడవడానికి చాలా ఇబ్బంది పడేవారని.. జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోయిందని చెప్పారు.

ఒకరోజు బాగా ఏడ్చేశారని.. కృష గారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నేను.. ఆయనను ఇబ్బంది పెట్టడమే కాకుండా మిమ్మల్నీ ఇబ్బంది పెడుతున్నా అంటూ ఎమోషనల్ అయ్యారని.. తన తల్లి ఏడవడంతో తన కళ్లల్లో కూడా కన్నీళ్లు ఆగలేదని నరేష్ ఎమోషనల్ గా చెప్పారు.

కృష్ణ గారిని ఆమె పడుతోన్న బాధ గురించి తెలియకుండా ఉండాలని నవ్వుతూ ఉండేవారని.. కృష్ణ గారిని ఒక తల్లిలా చూసుకున్నారని.. భార్యగా, స్నేహితురాలిగా ప్రతీ సమయంలోనూ అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. ఈరోజుల్లో ఉమ్మడి కుటుంబం చాలా కష్టమని.. అలాంటిది ఆమె మా అన్నదమ్ములందరినీ కలిపిందని  చెప్పుకొచ్చారు.