మార్వెల్ స్టూడియోస్ చిత్రాల్లో బ్లాక్ విడోగా అదరగొడుతున్న స్కార్లెట్ జాన్సన్ గురించి పరిచయం అవసరం లేదు. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, అవేజర్స్ ఎండ్ గేమ్ చిత్రాలతో స్కార్లెట్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది. బ్లాక్ విడోగా ఆమె విన్యాసాలు అబ్బురపరిచే విధంగా ఉంటాయి. అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం ఇటీవల విడుదలై ప్రపంచంలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అవెంజర్స్ సూపర్ సూపర్ హీరోలంతా ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. 

అవెంజర్స్ సక్సెస్ కి తోడు స్కార్లెట్ మరో సంతోషంలో మునిగితేలుతోంది. శనివారం రోజు స్కార్లెట్ జాన్సన్ కు, తన ప్రియుడు  కొలిన్ జోస్ట్ కు నిశ్చితార్థం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ ఏడాదే వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారట. స్కార్లెట్ ప్రియుడు కొలిన్ జోస్ట్ పేమస్ టివి షో సాటర్ డే నైట్ లైవ్ ద్వారా కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

గత రెండేళ్లుగా వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారు. 2017లో తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు స్కార్లెట్ ప్రకటించింది. కొలిన్ జోస్ట్ కు ఇది తొలి వివాహమే. కానీ స్కార్లెట్ కు మాత్రం ఇది మూడవ పెళ్లి. గతంలో ఆమెకు రెండు వివాహాలు జరిగాయి. 2008లో స్కార్లెట్ కు, ప్రముఖ నటుడు ర్యాన్ రెనాల్డ్స్ కు వివాహం జరిగింది. 2011లో ఈ జంట విడిపోయారు. అనంతరం స్కార్లెట్ 2014లో ప్రముఖ జర్నలిస్ట్ రొమైన్ ని వివాహం చేసుకుంది. మూడేళ్ళ కాపురం తర్వాత వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. వీరిద్దరికి ఓ కుమార్తె కూడా పుట్టింది.