తను తొలిసారిగా పరిచయమవుతూ రూపొందిన సినిమా బ్యాన్ అయ్యిందంటే ఎవరికైనా బాధ కలుగుతుంది. దానికి తోడు సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే ఇంక ఆ హీరో,హీరోయిన్స్ బాధ వర్ణించలేం. ఇప్పుడు అదే పరిస్దితిని ఎదుర్కొంటోంది హీరోయిన్ సార అలీ ఖాన్. 

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం కేదార్‌నాథ్. డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంపై ఉత్తరాఖండ్‌లో నిషేధం విధించింది. అయితే ఈ సినిమాపై నిషేధం విధించడం తనను ఎంతో నిరాశకు గురిచేసిందని సారా అలీఖాన్ మీడియా దగ్గర ఆవేదన వ్యక్తం చేసింది. 

అయితే అదే సమయంలో ప్రభుత్వ నిర్ణయాలను, ప్రజల మనోభావాలను గౌరవిస్తానని చెప్పింది. కానీ ఆమె మాటలు చూస్తూంటే ..అక్కడ జనాలను రెచ్చగొట్టి...సినిమా రిలీజ్ చేయండి  అని గవర్నమెంట్ ని డిమాండ్ చేసేలా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

హిందూ యువతి, ముస్లిం యువకుడికి కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రంలో మధ్య ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. రిలీజైన మార్నింగ్ షోకే ఈ సినిమా కు ప్లాఫ్ టాక్ వచ్చింది.  దాంతో కలెక్షన్స్ పూర్తి డ్రాప్.. ఈ నేపధ్యంలో అది చాలదన్నట్లు   ఈ ఫిల్మ్‌ను ఉత్త‌రాఖండ్‌లో బ్యాన్ చేశారు. 

ఈ సినిమా బ్యాన్ పై సారా స్పందిస్తూ... "ఈ సినిమాను ఉత్తరాఖండ్‌లో షూట్ చేశాం. సినిమా కోసం 40 రోజులు అక్కడే ఉన్నాం. నా జీవితంలో ఎన్నో స్వీట్ మెమరీస్ ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి. అయితే అలాంటి ఆనందాలని ఉత్తరాఖండ్ వాసులకు అందించకపోతున్నందకు నిరాశకు గురిచేస్తోంది. 

ఎందుకంటే ఆ ప్రాంతవాసులు నాకు చాలా ఇచ్చారు. కులం, మతం, జాతి అనే వాటిని నేను పరిగణలోకి తీసుకోను. ఈ చిత్రం ఎవరినీ విడదీయదు. కలుపుతుంది. ఓ నటిగా తన పాత్రకు తాను వంద శాతం న్యాయం చేశానని, నటిగా ప్రజల మనోభావాలను గౌరవిస్తా. ఈ చిత్రంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో నాకు తెలియదని చెప్పుకొచ్చింది సారా అలీఖాన్.

ఇక ఈ సినిమాను మొదట నైనిటాల్‌, ఉద్ద‌మ్‌సింగ్ న‌గ‌ర్ జిల్లాల్లో ఈ సినిమాను నిషేధించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా సినిమాను నిషేధించార‌ని ఆ రాష్ట్ర మంత్రి స‌త్య‌పాల్ మ‌హారాజ్ తెలిపారు. కేదార్‌నాథ్ సినిమాపై వివాదం చెల‌రేగ‌డంతో దాన్ని బ్యాన్ చేసిన‌ట్లు స‌మాచారాం. సినిమాకు సంబంధించిన రిపోర్ట్‌ను సీఎంకు అంద‌జేశామ‌ని మంత్రి తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు కూడా ఆదేశాలు జారీ చేశామ‌న్నారు.