ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాలు రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి
తెలుగు,తమిళ పెద్ద నిర్మాతలు ఎప్పుడు సంక్రాంతి సీజన్ కే తమ సినిమాలు రిలీజ్ కావాలని కోరుకుంటారు. సినిమా ఓ మాదిరిగా ఉన్నా కలెక్షన్స్ కు లోటు ఉండదు. ఇంక కంటెంట్ అదిరిపోతే ఆ రచ్చ వేరే రేంజిలో ఉంటుంది. అందుకోసం ముందే స్లాట్స్ బుక్ చేసుకుంటున్నట్లుగా రిలీజ్ డేట్స్ ప్రకటించి, తమ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాలు రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పటినుంచి వచ్చే సంక్రాంతికి రిజర్వేషన్స్ మొదలయ్యాయి.
ఈ ఏడాది సంక్రాంతి 2024 స్లాట్‌ను ముందుగా బుక్ చేసుకున్న టీమ్ #ProjectK. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2024 జనవరి 12న పాన్ వరల్డ్ మూవీ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా #SSMB28 తో సంక్రాంతి కి రిలీజ్ ఉంటుంది అని ప్రకటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ లుక్ లో ఉన్న పోస్టర్ తో పాటు జనవరి 13, 2024 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
అలాగే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన #RC15 తో రామ్ చరణ్ కూడా సంక్రాంతి 2024 సీజన్‌కు వస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఈ రోజు చరణ్ పుట్టినరోజు కావడంతో విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాసం ఉంది. ఇదిలా ఉంటే #RC15 కి బదులు శంకర్ `ఇండియన్ 2` సంక్రాంతి పండగకి రిలీజ్ అవుతుందనే టాక్ కూడా ఉంది. ఏదేమైనా టాలీవుడ్ బడా స్టార్స్ ప్రభాస్, మహేష్ సినిమాల అనౌన్స్ మెంట్ తో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇక అల్లు అర్జున్ నటిస్తున్న #PushpaTheRule #Pushpa2 చిత్రం డిసెంబర్ లేదా జనవరి 2023కు ఉండే అవకాసం ఉంది. సుకుమార్ అప్పటికే పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేస్తారు. పుష్ప పార్ట్ 1 సూపర్ హిట్ అవటంతో ఈ సినిమాపై పూర్తి అంచనాలు ఉన్నాయి. మరో ప్రక్క పవన్ కళ్యాణ్ ఉస్తాత్ భగత్ సింగ్, నాగార్జున పట్టాలు ఎక్కిస్తున్న మళయాళ రీమేక్ లు సైతం సంక్రాంతికి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.