సంక్రాంతి బరిలో దిగనున్నట్లు నాలుగు బడా చిత్రాలు ప్రకటించాయి. అయితే స్పష్టమైన తేదీలు మాత్రం వెల్లడించలేదు. దీంతో సంక్రాంతి చిత్రాల విడుదల తేదీల విషయంలో కొంత కన్ఫ్యూషన్ నెలకొంది.  

సినిమా లవర్స్ కి సంక్రాంతి ఎప్పుడూ ప్రత్యేకమే. గత రెండేళ్లు కరోనా కారణంగా పెద్ద చిత్రాల విడుదల లేకుండా పోయింది. 2022 సంక్రాంతికి రాధే శ్యామ్, ఆర్ ఆర్ ఆర్ విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. అయితే 2023 సంక్రాంతి పోరు రసవత్తరంగా మారింది. ఎందుకంటే నాలుగు పెద్ద చిత్రాలు పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదిపురుష్, వారసుడు, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. 

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆదిపురుష్ విడుదల కావడం లేదు. జనవరి 12 విడుదల తేదీగా ప్రకటించిన మేకర్స్ వెనక్కితగ్గినట్లు సమాచారం. ఆదిపురుష్ సమ్మర్ కి పోస్ట్ పోన్ చేశారంటూ టాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక మిగిలిన మూడు చిత్రాలు మాత్రం ఖచ్చితంగా సంక్రాంతి రేసులో పోటీపడనున్నాయి. అయితే ఈ చిత్రాలేవీ స్పష్టమైన డేట్స్ వెల్లడించలేదు. 

అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి వాల్తేరు వీరయ్య బాలయ్య, విజయ్ చిత్రాలకంటే ముందు విడుదల అవుతుందట. జనవరి 11న వాల్తేరు వీరయ్య విడుదల కావచ్చు అంటున్నారు. ఇక విజయ్ నటించిన వారసుడు జనవరి 11 లేదా 13న విడుదల చేస్తారట. వాల్తేరు వీరయ్య విడుదలైన నెక్స్ట్ డే జనవరి 12న వీరసింహారెడ్డి విడుదల చేస్తారట. తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ కి మేకర్స్ నుండి అందుతున్న సమాచారం ఇదేనట.

ఈ మూడు చిత్రాలతో పాటు అజిత్ లేటెస్ట్ మూవీ తునివు విడుదల కానుందట. తునివు బాలయ్య వీరసింహారెడ్డితో పాటు జనవరి 12న విడుదల కానుంది అంటున్నారు. ప్రస్తుతానికి టాలీవుడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ తారీఖుల్లో సంక్రాంతి చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ నాలుగు చిత్రాలపై పరిశ్రమలో అంచనాలున్నాయి.