కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం‘కేజీఎఫ్’. ఈ  చిత్రం ఐదు భాషల్లో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.  ప్రపంచవ్యాప్తంగా రూ 200 కోట్లు రాబట్టిన తొలి కన్నడ చిత్రంగా  కేజీఎఫ్‌ రికార్డు నెలకొల్పింది. 

విడుదలైన అన్ని భాషల్లో కేజీఎఫ్‌ మంచి కలెక్షన్స్  సాధించింది. షారుక్‌ ఖాన్‌ జీరో, రణ్‌వీర్‌ సింగ్‌ల సింబా సినిమాలను తట్టుకుని ఈ సినిమా హిందీ వెర్షన్‌ రూ 40 కోట్లు వసూలు చేయడం బాలీవుడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. దాంతో ఈ చిత్రం సెకండ్ పార్ట్ ని మరింత పెద్దదిగా చేయటానికి గానూ బాలీవుడ్ స్టార్స్  సీన్ లోకి తీసుకు వస్తున్నారు. 

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన వర్క్ జరుగుతుంది. అయితే ఈ రెండవ  పార్ట్ లో బాలీవుడ్ హీరో సంజయ్ దత్, అలాగే రమ్యకృష్ణ కూడా నటిస్తున్నారని బాలీవుడ్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ఫరాన్ అక్తర్ ఈ విషయమై చిత్రం యూనిట్ తో చర్చలు జరిపారని, సంజయ్ దత్ ని సీన్ లోకి తేవటం ద్వారా అక్కడ మార్కెట్ కు ప్లస్ అవుతుందని, అలాగే సంజయ్ కు దక్షిణాదిలో మరో సారి చిత్రం చేసినట్లు ఉంటుందని ప్లాన్ చేస్తున్నారట. 

ఇక బాహుబలి తో రమ్యకృష్ణకు దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. అది కూడా ఈ ప్రాజెక్టుకు ప్లస్ అయ్యేందుకు టీమ్ సిద్దపడుతోంది. భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ సినిమా భారీ వసూళ్లు రాబట్టడం ఈ సీక్వెల్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. కేజీఎఫ్‌ అనూహ్య విజయం హీరో యష్‌కు ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది.