ఈ వారంలో బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ రౌండ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే మొదటి వీక్ లో ఎవరిని పంపరేమో అని అనుకున్నారు. కానీ బిగ్ బాస్  హౌస్ నుండి సంజనాను బయటకు పంపించేశారు. సామాన్యురాలిగా బిగ్ బాస్ షోలో అవకాశం దక్కించుకొని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి రోజు నుండి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ముఖ్యంగా నటి తేజస్వికి సంజనాకు నిమిషం కూడా పడేది కాదు.

దీంతో హౌస్ లో ఉన్న వారం రోజులు కూడా వీరిద్దరూ మాటకు మాట అనుకుంటూనే ఉన్నారు. సంజనా దురుసు ప్రవర్తనతో విసిగిపోయిన హౌస్ లో సభ్యులు ఆమెను ఎలిమినేషన్ రౌండ్ లో నామినేట్ చేశారు. ప్రేక్షకుల ఓట్లు కూడా ఆమెకు తక్కువగా రావడంతో ఈ వారం హౌస్ నుండి బయటకు వచ్చేసింది. వస్తూ వస్తూ తేజస్వి, బాబు గోగినేనిల మీద విమర్శలు చేసింది. ముందుగా తేజస్విని పక్క వారితో సవ్యంగా ఉండమని, అందరిని సమానంగా చూస్తే బాగుపడతావని చెప్పింది.

ఇక బాబుగోగినేని బయటకి కనిపించేంత మంచి వ్యక్తి కాదని ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమేనని చెప్పింది.. ఎలిమినేట్ అయిన కంటెస్టంట్ కు బిగ్ బాస్.. బిగ్ బాంబ్ ఒకరిపై ప్రయోగించే ఛాన్స్ ఇస్తాడు. సంజనా ఆ బిగ్ బాంబ్ ను బాబు గోగినేని గారిపై విసిరింది. దాని ప్రకారం ఈ వారం మొత్తం హౌస్ లో ఎవరికి మంచి నీళ్లు కావల్సివచ్చినా.. బాబు గోగినేని వారికి అందివ్వాలి.  

ఇక షో విషయానికొస్తే.. హౌస్ లోకి నందిని రాయ్ అనే హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఆమె ఎప్పుడు హౌస్ లోకి వెళ్తుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.