టాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' చిత్రంతో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. తొలి సినిమాతోనే జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో అతడి పెద్ద ఆఫర్లే వచ్చాయి కానీ బాలీవుడ్ లో ఛాన్స్ రావడంతో అక్కడకి వెళ్లాడు.

'అర్జున్ రెడ్డి' చిత్రాన్నే 'కబీర్ సింగ్' పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు. సినిమాకి డివైడ్ టాక్ వస్తున్నా.. కలెక్షన్లు మాత్రం కుమ్మేస్తోంది. ఇప్పటికే రూ.150 కోట్లు వసూళ్లు సాధించిన ఈ సినిమా రెండు వందల కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. 

ఈ ఏడాది టాప్ 3 గ్రాసర్స్ లో ఈ సినిమా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా సక్సెస్ తో సందీప్ రెడ్డి వంగాకి బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. 'కబీర్ సింగ్' సక్సెస్ గురించి విన్న సల్మాన్ ఖాన్.. సందీప్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

ఈ సినిమాను టీసిరీస్ సంస్థ నిర్మించడానికి రెడీ అవుతోందట. అయితే ఈ వార్తలపై సల్మాన్, సందీప్ ల నుండి ఎలాంటి అధికార ప్రకటన లేదు. సందీప్ వంగా క్రేజ్ చూస్తుంటే అతడు ఇక బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోతాడేమో అనిపిస్తోంది!