సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో డ్రగ్స్‌ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులు ముంబై డ్రగ్‌ మాఫియా డొంక కదులుతుండగా కన్నడ సినీ పరిశ్రమలోనూ డ్రగ్స్‌ కేసు ఇండస్ట్రీ వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. విచారణ జరుపుతున్న సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌  పోలీసులు స్టార్ హీరోయిన్‌ రాగిణి ద్వివేది సహా 12 మంది మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఈ కేసులో మొదటి ముద్దాయి శివ ప్రకాష్ అలియాస్‌ చిప్పి, రెండో ముద్దాయిగా రాగిణి, మూడో ముద్దాయిగా ప్రముఖుల కోసం  హైఫై పార్టీలను ఏర్పాటు చేసే విరేన్‌ ఖన్నాల ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరితో పాటు ప్రశాంత్ రంక, వైభవ్ జైన్‌, ఆదిత్య అల్వ, లోమ్ పెప్పర్‌ సాంబ, ప్రశాంత్ రాజు, అశ్విన్ అలియాస్‌ బూగీ, అభిస్వామి, రాహుల్ టోన్స్‌, వినయ్‌ అనే పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది.

అయితే ఈ కేసులో మొదటగా అరెస్ట్ అయిన రవిశంకర్‌, రాహుల్ శెట్టిల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో కనిపించకపోవటంపై ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరింత సమాచారం సేకరించిన తరువాత వారి పేర్లు కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నమోదైన ఎఫ్ఐఆర్ మేరకు నిందితుల మీద ఐపీసీ సెక్షన్‌ 120బి, 21, 21సి, 27ఏ, 27 బీ, 29 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.