డ్రగ్స్ వ్యవహారం ఇండస్ట్రీ వర్గాలను కలవరపెడుతోంది. సాండల్‌వుడ్ స్టార్‌లకు కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టుగా వార్తలు వస్తుండటంతో కన్నడ సినీ పరిశ్రమలో కలవరం మొదలైంది. కన్నడ అందాల భామ రాగిణి ద్వివేది ఫ్రెండ్ రవిశంకర్‌ను  సిటీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. రాగిణి పేరు కూడా ప్రముఖంగా వినిపించటంతో ఆమెకు నోటిసులు పంపినా ఆమె విచారణకు హాజరు కాలేదు.

దీంతో బుధవారం రాత్రి మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఆమె ఇంటికి వెళ్లారు. కానీ ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోవటంతో వాట్సప్‌ ద్వారా నోటీసులను పంపించారు. అయితే రాగిణి పోలీసులుకు దొరక్కుండా తప్పించుకుంటుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రాగిణి న్యాయవాదితో కలిసి సీసీబీ ఆఫీసుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ఆరోగ్యంగా బాలేకపోవటం వల్లే తాను విచారణకు హాజరు కాలేకపోయానని ఆమె ట్వీటర్‌లో పోస్ట్ చేసింది.

మరో నటి సంజన సన్నిహితుడు రాహుల్‌ కూడా ఈ కేసులో అరెస్ట్ కావటం కలకలం సృష్టిస్తోంది. సాండల్‌వుడ్‌కు సంబంధించిన వారు వరుసగా అరెస్ట్ అవుతుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో కలవరం మొదలైంది. రాహుల్ ఫోస్‌ స్వాధినం చేసుకున్న అధికారులు కాల్ డాటాను విశ్లేషిస్తున్నారు. రాహుల్ మొబైల్ డాటా ఆధారంగా మరికొంత మందికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు  సీసీబీ పోలీసులు.

ఈ కేసులో బాలీవుడ్ లింక్‌లు కూడా బయటపడుతున్నాయి. ఈ మేరకు ప్రముఖ సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ సంబరగి ఆరోపణలు చేయటంతో కేసులో మరింత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతియాజ్‌ ఖత్రిని విచారిస్తే కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్లు రాగిణి, సంజనలపై కూడా ప్రశాంత్‌ తీవ్ర ఆరోపణలు చేశాడు.