మనదేశానికి సంభందించిన స్టార్ ..బాహుబలి గురించి మాట్లాడారు..అందులో నటించాలని ఉత్సాహం చూపుతున్నారంటే అందులో వింతేమీ లేదు. కానీ హాలీవుడ్ ని దశాబ్దాల తరబడి ఏలుతున్న స్టార్ శామ్యూల్‌ ఎల్.‌ జాక్సన్‌...మన బాహుబలి సినిమా ప్రసక్తి తీసుకువచ్చి ఆ తర్వాత తీయబోయే ప్రాంఛైజీలో నటిస్తాననటం మాత్రం ఆశ్చర్యమే. 

హాలీవుడ్ లో నట దిగ్గజంగా పేరు తెచ్చుకున్న శామ్యూల్ ఎల్ జాక్సన్  బాహుబలి-3లో అవకాశం ఇస్తే తప్పకుండా నటిస్తానని మనసులో మాట బయటపెట్టాడు. తాను నటించిన కొత్త చిత్రం అవెంజర్స్: కెప్టెన్ మార్వెల్ ప్రమోషన్స్ లో భాగంగా 'మోస్ట్ లీ సేన్' అనే ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శామ్యూల్ ఎల్ జాక్సన్ ఈ  ఆసక్తికర విషయం వెల్లడించాడు.

మీకేమైనా భారత్ వెళ్లే ఆలోచన ఉందా? అని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ప్రశ్నించగా, అక్కడెవరైనా మంచి పాత్ర ఇస్తే ఎందుకు వెళ్లను? అంటూ సమాధానం చెప్పాడు జాక్సన్. అంతేకాదు, మీరు బాలీవుడ్ గురించి ఎప్పుడైనా విన్నారా? బాలీవుడ్ సినిమాలో నటించాలనుకుంటున్నారా? అని అడగ్గా... బాహుబలి-3లో నటించాలని కోరుకుంటున్నాను అంటూ జవాబిచ్చాడు.  దీంతో మరోసారి ‘బాహుబలి’ సినిమా వార్తల్లో నిలిచింది. అన్నా బోడెన్, ర్యాన్ ఫ్లెక్ సంయుక్తంగా దర్శకత్వం  వహించిన ‘‘అవెంజర్స్‌: కెప్టెన్‌ మార్వెల్‌’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ అందుకుంది. 

ది ఎక్సార్సిస్ట్, జురాసిక్ పార్క్, ఏ టైమ్ టు కిల్, డై హార్డ్ విత్ ఏ వెంజన్స్, ద ఇంక్రెడిబుల్స్, స్టార్ వార్స్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు శామ్యూల్ ఎల్ జాక్సన్. 1994లో వచ్చిన పల్ప్ ఫిక్షన్ అనే చిత్రంలో కనబర్చిన నటనకు గాను ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యారు.