కన్నడలో సూపర్ హిట్ అయిన 'యూటర్న్' చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒరిజినల్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ తెలుగు వెర్షన్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. 'నేను ఈ రకంగా బార్ కౌంటర్‌లో ఇన్ని శబ్దాల మధ్య ఇలా కూర్చుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఐదు రోజులు నా లైఫ్‌లో జరిగిందంతా.. నిజమా..? అబద్ధమా..?' అంటూ సమంత చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఆర్కే పురం ఫ్లై ఓవర్ మీద జరిగిన ఓ యాక్సిడెంట్ ని ఇన్వెస్టిగేట్ చేసే జర్నలిస్ట్ పాత్రలో సమంత కనిపించనుంది.

ఓ హత్య కేసులో సమంతను పోలీసులు అనుమానించడంతో 'నేనేం చేయలేదు సార్..' అంటూ ఇన్నోసెంట్ గా చెబుతూ కనిపించింది. సస్పెన్స్ త్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. నేపధ్య సంగీత అదనపు ఆకర్షణగా నిలిచింది. సమంత సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. వచ్చే నెల 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.