మొన్నీ మధ్యే ‘రంగస్దలం’ సినిమాలో పీరియడ్ లుక్ లో కనపడింది సమంత.ఆ  సినిమాకు సమంత కు చాలా పేరు తెచ్చిపెట్టింది.ఆ ఉత్సాహంతో ...ఇప్పుడు  ..మరోసారి ఎనభైల నాటి వాతావరణంలో జరిగే కథలో కనిపించనుంది. ఈ మేరకు ఆమె తన కాస్ట్యూమ్స్ ని రెడీ చేసుకుంటోంది. 1980–90 రోజుల్లో ఉండే చీరలు ఆమె కట్టుకోవాలనుకున్నారు. ఆ లుక్ కోసం  ఏకంగా డజనుకుపైగా చీరలను సెలక్ట్‌ చేస్తున్నట్లు మీడియా వర్గాల సమాచారం. ఇంతకీ ఏ సినిమా కోసం అంటే ‘మిస్ గ్రానీ’రీమేక్‌ కోసమట.

కథాంశాల ఎంపికలో కొత్తదానానికి పెద్దపీట వేస్తున్నది సమంత. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వినూత్న స్టోరీ లైన్స్ ని  ఎంపిక చేసుకుంటోంది. పెళ్లయిన తర్వాత సినిమాల ఎంపికలో సమంత ఆచితూచి వ్యవహరిస్తోంది. తాజాగా ఈ చెన్నై సోయగం దక్షిణ కొరియన్ చిత్రం మిస్ గ్రానీ తెలుగు రీమేక్‌లో నటించటానికి సిద్దమవుతోంది.

నందినిరెడ్డి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్‌బాబు నిర్మిస్తున్నట్లు  తెలుస్తున్నది. 2014లో దక్షిణ కొరియాలో విడుదలైన మిస్‌గ్రానీ చిత్రం చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో పునర్నిర్మించబడి ప్రేక్షకుల ఆదరణ చూరగొంది. 

70ఏళ్ల వృద్ధురాలు కొన్ని అనుకోని  పరిస్థితుల్లో 20ఏళ్ల యువతిగా మారుతుంది. యవ్వనాన్ని పొందిన ఆ వృద్ధురాలు జీవితంలో మిగిలిపోయిన లక్ష్యాల్ని ఎలా సాధించింది? ఈ క్రమంలో ఎదురైన సంఘటనలేమిటి? అనే అంశాల చుట్టూ ఎంటర్టైన్మెంట్ గా మిస్ గ్రానీ కథ నడుస్తుంది. 

ఈ కథ సమంతకు ఎంతగానో నచ్చిందని, ఆమె ప్రోత్సాహంతోనే తెలుగు రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.  జనవరిలో ఈ సినిమా షూటింగ్‌ మొదలుకానుందని సమాచారం. సురేశ్‌బాబు నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం త్వరలో వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం భర్త నాగచైతన్యతో కలిసి ‘మజిలీ’అనే సినిమాలో నటిస్తున్నారు సమంత. ‘నిన్ను కోరి’ ఫేమ్‌ శివనిర్వాణ ఈ సినిమాకు దర్శకుడు.