అక్కినేని సమంత ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతోంది. సమంతకు వస్తున్న అవకాశాలన్నీ నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలే. గత ఏడాది నుంచి తీసుకుంటే.. మహానటి, రంగస్థలం, యుటర్న్, మజిలీ లాంటి చిత్రాల్లో సమంత అద్భుత నటన ప్రదర్శించింది. వివాహం అయ్యాక కూడా సమంత జోరు తగ్గడం లేదు. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది. 

ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన చిత్రం ఓ బేబీ. ఈ చిత్రంలో సమంత వృద్ధురాలి నుంచి 20 ఏళ్ళ యువతిగా మారిన పాత్రలో నటిస్తోంది. ఓ బేబీ చిత్రం జులై 5న ప్రపంచ వ్యక్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర ప్రచారం కోసం ట్విట్టర్ లో సమంత ఓ బేబీ అక్కినేని అని తన పేరు మార్చుకుంది. దీనిపై కొందరు పుకార్లు సృష్టించారు. సమంత గర్భవతి అని అందుకే ట్విట్టర్ లో ఓ బేబీ అని పేరు మార్చుకుందని ప్రచారం చేశారు. 

కొన్ని ప్రముఖ మీడియా సంస్థల్లో కూడా ఈ కథలు వచ్చాయి. దీనిపై సమంత సోషల్ మీడియాలో స్పందించింది. సమంతని ఓ వ్యక్తి ట్విట్టర్ లో ప్రెగ్నెన్సీ గురించి ప్రశ్నించగా.. 'డామ్.. మీకు ఎవరు చెప్పారు.. నాకు తెలియపరచండి' అంటూ సమాధానం ఇచ్చింది.  2017లో సమంత, నాగ చైతన్య వివాహం చేసుకున్నారు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు.