రేపే సమంత-నాగచైతన్యల పెళ్లి. ఇపుడు అందరి దృష్టి నాగ చైతన్య-సమంత పెళ్లి వైపు మళ్లింది. వీళ్ల వివాహం గోవాలో జరగనుంది. ఈ నెల 6న నాగచైతన్య, సమంతల వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. అనంతరం క్రైస్తవ సంప్రదాయ పద్ధతుల్లో 7తేదీన మరోసారి పెళ్లి చేసుకుని ఇరువురూ భార్యా భర్తలు కాబోతున్నారు. ఈ కల్యాణ వేడుక కేవలం తమ కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరగనుందని నాగార్జున తెలిపారు.

 

గోవాలోని ‘డబ్ల్యూ' అనే ఖరదీదైన స్టార్ హోటల్ చైతన్య-సమంతల వివాహానికి వేదిక కాబోతోంది. ఈ వివాహ వేడుకకు దాదాపు 200 మంది గెస్టులు హాజరు కాబోతున్నారు. వీరి కోసం హోటల్ లోని రూమ్స్ అన్నీ దాదాపుగా బుక్ చేసేశారట. ‘డబ్ల్యూ' హోటల్ లో రూమ్స్ ఒక్కోరూమ్ ప్రారంభ రోజుకు ధర రూ. 16 వేల రూపాయలు. ఖరీదైన సూట్ ఖరీదు రోజుకు రూ. 75 వేల రూపాయలు.

చైతన్య, సమంత బంధువులందరికీ ‘డబ్ల్యూ' హోటల్ లోనే రూమ్స్ బుక్ చేశారట. అయితే కొందరు స్నేహితులకు మాత్రం దగ్గర్లోని మరో హోటల్ లో విడిది ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చైతు, సమంత వెడ్డింగ్ టాలీవుడ్లో అత్యంత ఖరీదైన వెడ్డింగ్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. పెళ్లి వేడుకలో డెకరేట్ చేయడానికి విదేశాల నుండి ప్రత్యేకంగా ఫ్లవర్స్ తెప్పించినట్లు సమాచారం.

 

రిసెప్షన్ గురించి అడిగితే నాగ చైతన్య వద్దని చెప్పాడని, దీంతో దాని గురించి నువ్వు ఆలోచించవద్దని, నేను చూసుకుంటానని చైకి చెప్పానని నాగార్జున తెలిపారు. చై రిసెప్షన్ హైదరాబాదులోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ లో ఈ నెల 15న జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు అందర్నీ ఆహ్వానిస్తానని నాగార్జున తెలిపారు.