మహానటి పాత్రలో సమంత నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సావిత్రి జీవితకథ చిత్రాన్ని నిర్మించనున్న స్వప్నా దత్,ప్రియాంక దత్

తెలుగు సినిమా రంగంలో మహానటిగా పిలిపించుకున్న సావిత్రి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. అందం, అభినయం.. ఇలా ఏదైనా సావిత్రికి ఎవరూ సాటి లేరన్నది నాటి తరం సినీ ప్రేక్షకుల మాట. ఇప్పటికీ ఎవరైనా కథానాయిక అద్భుతంగా నటిస్తే ఆమెతో పోలుస్తారు. అటువంటి మహానటి జీవితకథ ఆధారంగా సినిమా తీయనున్నట్టు ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చెప్పినప్పట్నుంచీ సావిత్రిగా ఎవరు నటిస్తే బాగుంటుందనే చర్చ మొదలైంది.

మహానటి రోల్ లో ఎవరు నటిస్తారా అన్న సందేహానికి ఇక పుల్ స్టాప్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అలాంటి సందేహాలన్నీ పటాపంచలు చేస్తూ.. ఆ రోల్ కోసం టాలీవుడ్ లో మాంచి ఇమేజ్ సంపాదించిన ఓ హీరోయిన్ ఫిక్స్ అయిందట.

ఆ అదృష్టం ఎవర్ని వరించిందా అనుకుంటున్నారా... ఇంకెవరో కాదు... సమంతకు దక్కిందని ఫిలింగర్‌ టాక్‌. ‘‘తెలుగులో కొత్త చిత్రాలకు సంతకం చేశా. అవేంటో ఇప్పటికిప్పుడు చెప్పేయాలనిపిస్తోంది’’ అని ఇటీవల సమంత ట్విట్టర్ లో పేర్కొన్నప్పటికీ, అసలు విషయం చెప్పలేదు. ఆమె పేర్కొన్న చిత్రాల్లో ‘సావిత్రి’ జీవితకథ ఒకటని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ కుమార్తెలు ప్రియాంకా దత్, స్వప్నా దత్‌ నిర్మించనున్నారు.

ఇక ఈ మూవీలో ఎన్టీఆర్, ఏఎన్నార్ రోల్స్ కూడా ఉంటాయని వాటికి జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య అయితే బావుంటుందని దర్శకుడు అనుకుంటున్నాడట. మరి వాళ్లేమంటారో చూడాలి.