నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం 'మజిలీ'. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలో సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చైతుతో ప్రేమ, పెళ్లికి ఎనిమిదేళ్లు పట్టిందని, చైతుని ముందు తనే ఇష్టపడినట్లు  చెప్పింది. అప్పుడు తనకు ఆ ఫీలింగ్ లేదని, తరువాత ఇద్దరి అభిప్రాయాలు కలిసినట్లు చెప్పుకొచ్చింది.

కొన్ని కారణాల వలన ఇద్దరూ ఒకరికొకరు దూరంగా ఉన్నట్లు, అలా కలవడానికి చాలా రోజులు పట్టిందని తెలిపింది. పెళ్లి తరువాత కోపం తగ్గించుకున్నానని, ఎప్పుడైనా చైతుకి తనకు గొడవ జరిగితే పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుంటామని వెల్లడించింది. ఒకరోజు ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందని, అయితే ఆ విషయం ఎవరికీ తెలియదని స్పష్టం చేసింది.

ఇక తనకు బిడ్డపుడితే తనే ప్రపంచమవుతుందని చెప్పింది. అలా జరిగితే కొన్నేళ్ల పాటు అన్నింటికీ దూరంగా ఉంటానని తెలిపింది. ఆ బిడ్డే తనకు సర్వస్వం అని స్పష్టం చేసింది. తన బాల్యంలో ఎన్నో కష్టాలు పడ్డానని తాను పొందలేనివి తన బిడ్డకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది.