బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ హోం క్వారంటైన్‌ అయ్యారు. 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలనుకున్నట్టు నిర్ణయించారు. ముందు జాగ్రత్తగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మరి ఇంతకి కరోనా ఎవరికి సోకిందంటే.. సల్మాన్‌ ఖాన్‌ డ్రైవర్‌, తన వద్ద పనిచేసే ఇద్దరి సిబ్బందికి కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది. దీంతో కరోనా చైన్‌ని బ్రేక్‌ చేసేందుకు సల్మాన్‌ హోం క్వారంటైన్‌ అయినట్టు తెలిపారు.  

కరోనా వచ్చిన తన సిబ్బందిని ముంబయిలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తన ఇంట్లో జరగబోయే ఓ ఫంక్షన్‌ కూడా రద్దు చేసుకున్నారు. తన తల్లిదండ్రులు సలీంఖాన్‌, సల్మా ఖాన్‌ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఓ వేడుక చేయాలని ప్లాన్‌ చేశారు. ఇప్పుడు కరోనా సోకడంతో దాన్ని రద్దు చేసుకున్నట్టు తెలిపారు. 

సల్మాన్‌ కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ముంబయిలో తన ఫామ్‌ హౌజ్‌లోనే ఉంటున్నారు. ఆ సమయంలో ఆయన వ్యవసాయ పనుల్లోనూ పాల్గొన్నారు. తనే స్వయంగా ఫామ్‌ హౌజ్‌ రోడ్లని ఊడ్చారు. మరోవైపు జాక్వెలిన్‌తో కలిసి ఓ స్పెషల్‌ వీడియో సాంగ్‌ని కూడా రూపొందించారు. ఇది విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. మరోవైపు సల్మాన్‌ ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో `రాధే` చిత్రంలో నటిస్తున్నారు. దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుంది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించనున్నారు.