కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన భారత్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన భారత్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించారు. అలీ అబ్బాస్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ వివిధ గెటప్పులలో కనిపిస్తున్నాడు. రంజాన్ సందర్భంగా తన చిత్రం విడుదలవుతుండటంతో సల్మాన్ ఖాన్ వివిధ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. 

సల్మాన్ ఖాన్ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఆన్సర్ లేని ప్రశ్న ఒకటి వినిపిస్తూ ఉంటుంది.. అదే మీ పెళ్లెప్పుడని. 53 ఏళ్ల వయసు వచ్చినా సల్లూ భాయ్ ఇంకా బ్యాచులర్ గానే ఉండిపోయాడు. బాలీవుడ్ సెలెబ్రిటీలు రణవీర్ సింగ్, దీపికా, ప్రియాంక, సోనమ్ కపూర్ ఇలా అందరి పెళ్లిళ్లు అయిపోతున్నాయి.. మీ పెళ్ళెప్పుడు అని మీడియా సల్మాన్ ఖాన్ ని మరో మారు ప్రశ్నించింది. ఈ సారి కాస్త ఘాటుగా స్పందించిన సల్మాన్ వివాహ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

వివాహ జీవితంపై నాకు నమ్మకం లేదు. పెళ్లనేది ప్రస్తుతం మరణిస్తున్న వ్యవస్థ. పెళ్లి కంటే సహజీవనమే బెటర్ అంటూ సల్మాన్ ఖాన్ తన మనసులో మాటని బయటపెట్టాడు. సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు చాలా మంది బాలీవుడ్ సెలెబ్రిటీలతో ప్రేమాయణం సాగించాడు. ప్రస్తుతం రొమేనియా బ్యూటీ ఇలియా వంటూర్ తో సల్మాన్ ఖాన్ డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.