ఏడాదికి ఒక్క సినిమా చేసే బాలీవుడ్ స్టార్ హీరోలు హిట్టు కొట్టారంటే మాములుగా ఉండదు. అయితే గత ఏడాది మాత్రం ఖాన్ త్రయం బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా రాణించలేదు. ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ బాయ్ సల్మాన్ ఖాన్ నుంచి వచ్చిన రేస్ 3 ఊహించని పరాజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు భరత్ అనే సినిమాతో సల్మాన్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. 

సినిమాకు సంబందించిన టీజర్ ను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది. సల్మాన్ డైలాగ్ అండ్ సరికొత్త మ్యానరిజంతో ఆకట్టుకుంటున్నాడు. "నీ జాతి నీ ధర్మ ఏమిటని అడిగేవారికి నేను స్మైల్ తో ఇచ్చే సమాధానం.. నా తండ్రి నాకు భరత్ అని దేశం యొక్క గొప్ప పేరును పెట్టారు. అలాంటి గొప్ప పేరుకు నా జాతి ధర్మం.. ఇంటిపేరుని తగిలించి నా పేరుకు గాని దేశానికి ఉన్న గౌరవాన్ని తక్కువ చేయాలదలచుకోలేదు" అని సల్మాన్ చెప్పిన డైలాగ్ వర్ణనాతీతం. 

ఒక నేవి ఆఫీసర్ గా సల్మాన్ మరో లుక్ తో అదరగొడుతూనే బైక్ రైడ్ తో అభిమానులకు కావాల్సిన కమర్షియల్ కిక్ ను ఇచ్చాడు. టైగర్ జిందా హై వంటి దేశభక్తి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అబ్భాస్ అలీ జాఫర్ మరోసారి అదే తరహాలో సల్మాన్ తో కొత్త ప్రయత్నమేదో చేస్తున్నాడు. 2019 ఈద్ కానుకగా రానున్న ఈ సినిమా సల్మాన్ బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎంతవరకు పెంచుతుందో చూడాలి.