రెండేళ్ళ గ్యాప్‌తో మళ్లీ మేకప్‌ వేసుకోబోతున్నారు బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌. ఆయన `బ్యాంగ్‌ బ్యాంగ్‌`, `వార్‌` చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో `పఠాన్‌` చిత్రంలో నటించబోతున్నారు. ఈ నెలలోగానీ, డిసెంబర్‌లోగానీ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. ఇందులో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించబోతుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే `ఓం శాంతి ఓం`, `చెన్నై ఎక్స్ ప్రెస్‌`, `హ్యాపీ న్యూ ఇయర్‌` చిత్రాల్లో నటించారు. ఇప్పుడు నాల్గో సారి రొమాన్స్ చేయబోతున్నారు. 

ఇందులో జాన్‌ అబ్రహం విలన్‌గా నటించబోతున్నట్టు తెలుస్తుంది. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ నిర్మించబోతున్న ఈ సినిమాలో సల్మాన్‌ గెస్ట్ గా మెరవబోతున్నారు. ఇప్పటికే షారూఖ్‌ హీరోగా వచ్చిన `కుచ్‌ కుచ్‌ హోతా హై`, `ఓంశాంతి ఓం`, `జీరో` చిత్రాల్లో సల్మాన్‌ గెస్ట్ గా మెరిసి అలరించారు. తాజాగా నాల్గోసారి సల్మాన్‌ మెరవబోతున్నట్టు తెలుస్తుంది. అతిథి పాత్ర కోసం ఆయన్ని సంప్రదించగా, వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 

ఇదిలా ఉంటే సల్మాన్‌ నటించిన `హర్‌ దిల్‌ జో ప్యార్‌ కరేగా`, `ట్యూబ్‌లైట్‌` చిత్రాల్లో షారూఖ్‌ అతిథిగా మెరిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్‌ `రాధే` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుంది.